రాజమండ్రి తెలుగుదేశం.. ఇలా ఎందుకుందండీ..

తెలుగుదేశం పార్టీకి కంచుకోట రాజమండ్రి .. అక్కడ టీడీపీదే హవా.. ఆ నాయకులు చెప్పిందే వేదం.. ఒకప్పుడు.. అయితే ఇపుడు సీన్ మారిపోయింది.. వారి పార్టీ అక్కడ బలంగానే ఉన్నా నాయకులు మాత్రం నువ్వా..నేనా అని కత్తులు దూసుకుంటున్నారు. వీరి వ్యవహారం చూసిన కార్యకర్తలు.. అరె.. పార్టీని వీరే నాశనం చేసేలా ఉన్నారే అని బాధపడుతున్నారట.  2019 ఎన్నికల్లో జగన్ హవాలో ఉన్నా రాజమండ్రిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఏమైందో..ఏమో.. ఎవరికి ఎక్కడ చెడిందో కానీ కొద్ది రోజులుగా నాయకుల మధ్య వైరం పెరిగింది.

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండగా..అర్బన్ శాసనసభ్యురాలిగా ఆదిరెడ్డి భవాని ఉన్నారు. ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు (ఎమ్మెల్యేకు మామయ్య ) ఉన్నారు. ఇపుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అప్పరావు వర్గాలు  ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది నెలలుగా రాజమండ్రి పార్టీ కార్యాలయం తలుపులు కూడా తెరుచుకోకపోవడం అక్కడ పార్టీ పరిస్థితి అద్దం పడుతుంది. పార్టీ పెద్దలు ఎవరైనా జోక్యం చేసుకొని సమస్య  పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నం చేయడం లేదు. జిల్లాకు చెందిన సీనియర్ నేత  యనమల రామక్రిష్ణుడు కూడా ఈ పార్టీ గోలను వదిలేశాడు. మరి ఈ వ్యవహారాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలా పరిష్కరిస్తారో చూడాలి..

Share post:

Latest