కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో పెళ్లి క్యాన్సెల్ అయిన తర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ మరింత హుషారుగా కనిపిస్తోంది. ఫంక్షన్లకు, బీచ్‌లకు తిరుగుతూ.. మస్తు ఎంజాయ్ చేస్తోంది. అలాగే వరుస సినిమాలతోనూ దూసుకుపోతోంది. తాజాగా మంచి రోజులు వచ్చాయి అంటూ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. పూర్తి వివరాల్లోకి వెళ్లే..
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. ఈ చిత్రంలో యువ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించారు. నిజజీవిత పాత్రలను స్పూర్తిగా తీసుకుని యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.
ఇక ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేసేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో యంగ్ హీరో శోభన్‌తో మెహ్రీన్ చిరు నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఎస్‌కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.