మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఏకంగా ఐదుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. మొదట విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్నట్టు ప్రకటించగా.. ఆ వెంటనే మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ మరియు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో వచ్చేశారు.
ఇక ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మొదలెట్టేశారు. దాంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే ఇలాంటి తరుణంలో సీనియర్ నటుడు, మాజీ `మా` అధ్యక్షులు మురళీ మోహన్ ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా మురళీ మోహన్ మాట్లాడుతూ..అసలు ఈ ఏడాది ఎన్నికలే జరగవని, ఏకగ్రీవమే జరుగుతుందని బాంబు పేల్చారు.
గతంలో మా మెంబర్స్ తక్కువగా ఉండటంతో చాలా పద్దతిగా ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. గాడి తప్పిన `మా` ను మళ్లీ పట్టాలెక్కించడానికి తనతో పాటు చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, కృష్ణంరాజు లాంటి సినీ పెద్దలు మాట్లాడుకుంటున్నామని.. అందరిని ఒకతాటి పైకి తెచ్చి ఏకగగ్రీవంగా మా ఎన్నికలు జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.