కొండా ’చేయి‘ పట్టుకుంటాడా.. కమలం నీడలో ఉంటాడా..

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. సమీకరణాలు మారిపోతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తుండటంతో పార్టీలన్నీ తమ బుర్రలకు పదును పెడుతున్నాయి. అక్కడ తమ అభ్యర్థే గెలవాలని అష్టకష్టాలు పడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎత్తుగడ మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.

టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తన కేడర్, కేపబిలిటీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇటీవల హుజూరాబాద్ లో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ను రహస్యంగా కలిసి దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. అంటే అక్కడ బీజేపీ గెలుపునకు ఆయన సహకరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది నాణేనికి ఓ వైపు.. మరోవైపేంటంటే.. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత రేవంత్ కు మద్దతు తెలిపారు.

ఓవైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ నేతలతో కొండా టచ్ లో ఉన్నారని చెప్పవచ్చు. హుజూరాబాద్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయాలపై ఓ స్పష్టత వస్తుంది. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాలా.. లేక బీజేపీలోనా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఏమైనా.. రాజకీయమంటే రాజకీయమే కదా..!