అంతే.. కేసీఆర్ ఈజ్ కేసీఆర్.. ఆయన ఎత్తుగడలు ఊహించడం కష్టం..

ఎంతైనా.. కేసీఆర్.. కేసీఆరే.. రాజకీయ ఎత్తులు..పై ఎత్తులు వేయడంలో ఆయనకెవరూ సాటిలేరనే చెప్పవచ్చు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ నాయకుల్లో గులాబీ బాస్ ప్లాన్స్ పసిగట్టడం చాలా కష్టం.. ఆయన తీసుకునే నిర్ణయాలు ఊహకేమాత్రం అందవు. ఏ పథకం ప్రవేశపెట్టినా లబ్ధి పొందేందుకే.. అధికారం కోసమే.. ఈ విషయం దళిత బంధు పథకం ప్రకటించినప్పుడు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు కూడా. సీఎం తీసుకున్న మరో నిర్ణయం ఏమంటే.. సింగరేణి కార్మికుల వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంపు. దీంతో సింగరేణి కార్మికుల్లో హ్యపీ.. అయితే ఈ సమయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని పెద్దగా ఎవరూ ఆలోచించరు. ఒక్క సింగరేణి కార్మికులకు తప్ప. ఈ విషయం సీఎంకు కూడా తెలుసు.

సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చు. అక్కడ గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా విజయం సాధించాలంటే ఏదో ఒక హామీ ప్రకటించాలి. అది ఫలితమివ్వాలి.. అందుకే ముఖ్యమంత్రి హోదాలో ఈ హామీ ఇచ్చారు. దీంతో 43,889 మంది కార్మికులు హ్యాపీ.. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గత ఎన్నికల్లో విజయం సాధించింది. అయినా కార్మికుల్లో పెద్ద సంతోషం లేదు. ఈ సంవత్సరం ఏప్రిల్ 16 నాటికి కాలపరిమితి ముగిసింది. అయితే కోవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంచడం చర్చనీయాంశమైంది.