కొత్త పార్టీ స్థాప‌న‌..క్లారిటీ ఇచ్చేసిన ఈటల!

ప్ర‌జ‌ల భూముల‌ను కబ్జా చేశార‌ని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ శాఖ నుంచి తొలిగించిన సంగ‌తి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. దాంతో వెంట‌నే ఆయ‌న‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయ‌డంతో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి.

అయితే ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. దీంతో ఆయ‌న కొత్త పార్టీలు పెట్ట‌బోతున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే తాజాగా కొత్త పార్టీ స్థాప‌న‌పై ఈట‌ల స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

ఇక ఇరవై సంవత్సరాల పాటు సీఎంతో కలిసి తిరగానని కాని సీఎం మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అయినా తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈట‌ల వాపోయారు.