బిగ్ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్..అస‌హ‌నంలో కస్టమర్లు!

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. దీంతో వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలు కూడా ఓటీటీలో విడుద‌ల చేశారు. ఇక థియేట‌ర్లు తెరుచుకున్నా ఓటీటీల క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోకు కూడా ఓటీటీ ప్లాట్ ఫాంలలో తనదైన ముద్ర వేసుకుంది.

అంతేకాదు, క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని అందించింది. దీంతో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ పొందలేని కస్టమర్లు నెలరోజుల ప్యాక్ తీసుకుని ఎంజాయ్ చేసే వారు. అయితే ఇప్పుడు అమోజాన్ ప్రైమ్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలకు లోబడి అమెజాన్ తన సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని మార్చింది.

తన నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ₹129ను తీసేసింది. అదేవిధంగా తన కొత్త కస్టమర్ల కోసం ఇచ్చే ఫ్రీ ట్రయల్‌ను కూడా తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే.. మూడు నెలలకు గాను యూజర్లు ₹329 చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఏడాదికి ₹999 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. అయితే నెల‌వారీ ప్లాన్ తీసేసినందుకు ప‌లువురు క‌స్ట‌మ‌ర్లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.