రాజ్యాంగానికి అవ‌మానం.. వరంగల్ ‘కుడా’కు న్యాయవాది తాఖీదులు

April 15, 2021 at 4:52 pm

ఇటీవల నగరంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ‘భారత రాజ్యాంగం’ నిర్మాణం పై చిత్రించిన ‘ప్రవేశిక’లో పలు కీలక పదాలను విస్మరించి రాజ్యాంగాన్ని అవమానించారంటూ ‘కుడా’ వైస్-చైర్మన్ కు న‌గ‌రానికి చెందిన న్యాయవాది ఎన్నంశెట్టి అఖిల్ లీగల్ నోటీసు జారీ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రవేశిక లోని కీలకమైన ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’, ‘మరియు ఇంటెగ్రిటీ’ పదాలు భారత రాజ్యాంగం యొక్క ‘ప్రాథమిక నిర్మాణం’లో భాగమని, వాటిని మార్చగలిగే అధికారం పార్లమెంటుకు కూడా లేదని సుప్రీం కోర్టు అనేక తీర్పులలో స్పష్టం చేసిందని ఈ నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు.

రాజ్యాంగ ప్రవేశిక వంటి ఒక ముఖ్యమైన దస్త్రాన్ని ముద్రించేటప్పుడు ఎటువంటి తప్పులు దొర్లకుండా అధికారులు అత్యంత శ్రద్ధ వహించి ఉంటారని భావిస్తున్నామని, కాబట్టి అధికారుల పర్యవేక్షణలో జరిగిన నిర్మాణంలో ఇంత కీలక పదాలను విస్మరించారంటే అది ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందని న్యాయ‌వాది వెల్ల‌డించారు. దానికి గాను నేరం రుజువైతే ద ప్ర‌వేన్ష‌న్ ఆఫ్ ఇన‌స‌ల్ట్ టుం నేష‌న‌ల్ హాన‌ర్ యాక్ట్ 1971 యొక్క సెక్షన్ 2 ప్రకారం బాధ్యులైన అధికారులు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసులో హెచ్చరించారు. నోటీసు అందిన వారం రోజులలోగా ఈ విషయాన్ని సరిదిద్ది, ప్రవేశిక ను ఉన్నది ఉన్నట్టుగా ముద్రించకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని, ఆ తర్వాతి పర్యవసానాలకు అధికారులే పూర్తి బాధ్యులవుతారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పుడిది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాజ్యాంగానికి అవ‌మానం.. వరంగల్ ‘కుడా’కు న్యాయవాది తాఖీదులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts