13 మంది జ‌ల‌స‌మాధి.. ఎక్క‌డంటే..

వేర్వేరు చోట్ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో ఏకంగా 13 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. ఒక చోట ఈత స‌ర‌దా ముగ్గురు యువ‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన‌గ‌, మ‌రోచోట ఊహించ‌ని ప్ర‌మాదంలో 10మంది న‌దిలో కొట్టుకుపోయారు. వివ‌రాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లికి చెందిన ఒకరు, వేములవాడకు చెందిన త‌న న‌లుగురు మిత్రుల‌తో క‌లిసి స్థానిక రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే ఆ సమీపంలోని మానేరు వాగులో ఈత కొట్టడానికి ఐదుగురు వాగులోకి దిగారు. అందులో ఇద్దరు క్షేమంగా బయటపడగా ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఐతరాజు పల్లికి చెందిన జోగుల మనోజ్(35), జోగుల అషేష్(9), వేములవాడకు చెందిన పెంట రాహుల్(20) మృతి చెందారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా బీహార్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ జీపు నేరుగా గంగా నదిలోకి దూసుకెళ్లింది. దీంతో జీపులో ఉన్న పదిమంది గల్లంతయ్యారు. ఈ ఘటన పాట్నా జిల్లా పీపాపుల్ వద్ద శుక్రవారం వెలుగుచూసింది. అయితే.. ప్రమాద సమయంలో జీపులో మొత్తం 15 మంది ఉండగా.. ఐదుగురు క్షేమంగా బయటపడ్డట్టు సమాచారం. ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే రంగంలోకి గ‌ల్లంత‌యిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియ‌రాలేదు.

Share post:

Latest