మ‌ళ్లీ మొద‌టికొచ్చిన `ఇండియ‌న్ 2` వివాదం!?

కమల్ హాసన్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా క‌మ‌ల్ హాస‌న్‌తో ఇండియ‌న్ 2 ను స్టార్ చేశాడు శంక‌ర్‌. లైకా ప్రొడెక్ష‌న్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వ‌చ్చారు.

ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి ఏదో ఒక అవాంత‌రం ఏర్ప‌డుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ 2ను పెండింగ్‌లో ప‌డేసి.. శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సినిమా, ర‌ణ్‌వీర్ సింగ్‌తో ఓ సినిమా ప్ర‌క‌టించాడు. దాంతో ఇండియ‌న్ 2 సినిమా పూర్తి చేశాకే శంక‌ర్ వేరే సినిమాలు మొద‌లు పెట్టేలా ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని హైకోర్టులో పిటీష‌న్ వేసింది లైకా.

అయితే కోర్టు గొడ‌వ‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించింది. ఈ క్ర‌మంలోనే శంక‌ర్ లాయ‌ర్ ఇటీవ‌ల లైకా వారిని క‌లిసి షూటింగ్ జూన్‌లో స్టార్ట్ చేసి అక్టోబ‌ర్ నాటికి ఫినిష్ చేస్తార‌ని చెప్పార‌ట‌. కానీ, లైకా వారు మాత్రం జూన్ నాటికే షూటింగ్ పూర్తి చేయాల‌ని భీష్మించుకుని కూర్చున్నారట‌. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయ‌ని.. వివాదం మ‌ళ్లీ మొద‌టికొచ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.