18 ఏళ్లు నిండాయా..అయితే వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!

కంటిని క‌నిపించ‌కుండా వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఈ మ‌హ‌మ్మారిని నిర్మూలించేందుకు ప్ర‌పంచ‌దేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొన‌సాగుతోంది. భార‌త్‌లో ఇప్ప‌టికే 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా.. రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇక నాలుగో దశలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను ఇవ్వ‌నున్నారు. మ‌రి క‌రోనా వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా www.cowin.gov.in లేదా కొవిన్‌, ఆరోగ్య సేతు యాప్‌ల ద్వారా పేర్లు నమోదు చేసుకోవ‌చ్చు వెబ్‌సైట్‌లో మీ మొబైల్‌ నంబర్‌ ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది.ఓటీపీ నమోదు చేయగానే పేజీ ఓపెన్‌ అవుతుంది.

దానిలో మీ పేరు, పుట్టిన తేదీ వివరాల‌ను గుర్తింపు కార్డులో ఉన్నట్లు నమోదు చేయాలి. ఆ త‌ర్వాత ఏదైనా ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంట‌ర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సెంటర్‌ను ఎంచుకున్న తరువాత స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.

అన్నీ పూర్తయిన తర్వాత మీ అపాయింట్‌మెంట్‌ను నిర్ధారిస్తూ ఓ సందేశం వస్తుంది. దానితోపాటు మీరు ఏదైతే గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేశారో ఆ వివరాలతో వ్యాక్సినేషన్‌ కేంద్రానికి మీరు ఎంచుకున్న తేదీ, సమయానికి వెళ్తే.. వ్యాక్సిన్ వేస్తారు. ఒక‌వేళ మీరు ఎంచుకున్న తేదీ, సమయానికి వెళ్లకపోతే రీ షెడ్యూల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.