పీఆర్సీ ఫైల్‌పై కేసీఆర్ సంత‌కం.. కానీ ఒక చేదువార్త‌..!

ప్ర‌భుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ ఫైల్‌కు సీఎం కేసీఆర్​ ఆమోదముద్ర వేశారు. దీంతో వారి పీఆర్సీకి క్లియర్ అయింది. వాస్త‌వానికి 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఒకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్​ను పంపించారు. వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్​ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్​ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అయితే సాగర్​ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్​ పెండింగ్​ పడింది. కానీ ఎట్టకేలకు క్లియర్​ అయింది. కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల వేతన పెంపుపై ఆర్థిక శాఖ ఎలాంటి మార్గదర్శకాలు, ప్రతిపాదనలు చేయలేదు. కానీ సీఎం మాత్రం వేతన సవరణ కమిషన్​ సూచనలను పరిగణలోకి తీసుకుని వేతనాల పెంపును చేయాలంటూ నిర్ణయం తీసుకుని, ఫైల్​పై సంతకం చేశారు. దీంతో ఉద్యోగవర్గాలందరికీ పీఆర్సీ అమలు చేస్తున్నారు. మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులు,హోంగార్డులు,అంగన్‌వాడీలు,ఆశా వర్కర్లు,విద్యా వాలంటీర్లు,వీఆర్ఏ,వీఏవో,సర్వ శిక్షఅభియాన్ సిబ్బందికి కూడా పీఆర్సీ వర్తింపజేస్తున్నట్లు గతంలోనే సీఎం ప్రకటించిన‌ట్లుగా ఈ పీఆర్సీతో మొత్తంగా 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొంద‌నున్నారు. ఈ నెల పెరిగిన సొమ్ముతో ఉద్యోగవర్గాలు వేతనాలు అందుకోనున్నాయి.

అయితే అంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డే ఉద్యోగుల‌కు ఒక చేదువార్త కూడా ఉన్న‌ది. అదేమిటంటే గ‌తంతో పోల్చితే ప్ర‌స్తుతం వ‌స్తున్న హెచ్​ఆర్​ఏ తగ్గనుంది. హెచ్ఆర్ఏ స్లాబులను 11,13,17,24 శాతంగా పీఆర్సీ నిర్ణయించింది. మెట్రో నగరాల్లో హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి కుదించడాన్ని తప్పు పడుతున్నారు. ప్రస్తుతం హెచ్​ఆర్​ఏ శ్లాబులు 11, 13, 17,24గా నిర్ణయించగా… గతంలో 12,14,20,30 శాతంగా శ్లాబులు ఉన్నాయి.