శ్రుతి హాసన్‌పై బీజేపీ ఫిర్యాదు..ఏం జ‌రిగిందంటే?

క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌పై బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శ్రుతిపై బీజేపీ ఫిర్యాదు చేయ‌డం ఏంటీ అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. నిన్న త‌మ‌ళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హసన్ నిన్న తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి మైలాపురంలో ఓటు వేసి.. ఆపై తాను పోటీ చేస్తున్న కోయంబత్తూరు సౌత్‌కు కూతుళ్ల‌తో క‌లిసి ప్రత్యేక విమానంలో వెళ్లారు. అక్క‌డ‌ ఓటింగ్ సరళిని సమీక్షించడానికి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.

ఆ సమయంలో కమల్ హసన్ వెంట శృతి హసన్ కూడా ఉండటంతో.. ఆమె అక్రమంగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారని.. క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పోలింగ్ కేంద్రాల్లోకి బూత్ ఏజెంట్లు తప్ప ఎవరూ వెళ్లకూడదనే రూల్ ఉందని.. ఆ రూల్‌ను శ్రుతి హాస‌న్ దిక్క‌రించార‌ని.. కాబ‌ట్టి వెంట‌నే ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాల‌ని కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.‌‌