బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం నాడు తన తీర్పును వెల్లడించింది. ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థన చేయగా అందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది.

ఏప్రిల్ 8 వ తేదీన జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని చెబుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సర్వోన్నత న్యాయస్థానం ప్రకారం 4 వారాల ఎన్నికల కోడ్‌ను అమలు చేసేలా చూడాలని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచిస్తూ పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐతే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లి గురువారమే పోలింగ్‌ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఎన్నికల సంఘం తో పాటు ఇతరుల వాదనలను విని.. పోలింగ్ నిర్వహించాల్సిందేనని స్పష్టంగా తీర్పు వెలువరించింది.