అవును! ఆశ్చర్యంగా అనిపించినా.. వివిధ తెలుగు టీవీ ఛానెళ్ల పరిస్థితి దారుణంగా ఉందట! ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని సమాచారం. తెలుగు వాకిట వార్తల సమాహారంతో సందడి చేసే ఈ న్యూస్ ఛానెళ్లలో ఓ నాలుగు తప్ప మిగిలినవి అన్నీ కూడా చాలా చాలా కష్ట నష్టాల్లో కూరుకుపోయాయని చెబుతున్నారు. ఇక, కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న వాటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీనికి ప్రధాన కారణం యాడ్ రెవెన్యూ లేకపోవడమే! సాధారణంగా ప్రింట్ మాధ్యమంలో యాడ్ ఇస్తే.. అది స్టాండర్డ్.. ఒక రోజు రోజంతా ఆ పేపర్ చేసిన వారికి ఆ యాడ్ చేరుతుంది. కానీ, టీవీల్లో కేవలం కొన్ని సెకన్లచొప్పున యాడ్స్ రేటు ఉండడంతో ఆ సెకన్ల కాలంలో టీవీని వీక్షించిన వారికే ఆ యాడ్ చేరుతుంది.
దీంతో కొన్ని పాప్యులర్ టీవీ ఛానళ్లకే యాడ్స్ వస్తున్నాయి. దీంతో మిగిలిన ఛానెళ్ల పరిస్థితి వైట్ ఎలిఫెంట్స్ మాదిరిగా మారింది. దీంతో యాజమాన్యాలు ఫస్ట్ స్టెప్‌గా ఉద్యోగులను తగ్గించడం, సెకండ్ స్టెప్‌గా ఉన్న జీతాల్లో కోత, థర్డ్ స్టెప్‌గా ఏకంగా ఛానెల్‌కు మూత! ఇదే ఫార్ములా చాలా ఛానెళ్లలో జరుగుతోంది. ఇక, ఇటీవల వార్తల్లోకి వచ్చిన మహా టీవీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే అయితే, ఈ టీవీ వాటాలను ఎన్ ఆర్ ఐ కొనుగోలు చేయడంతో ఒకింత ఛానెల్ బట్టకట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, ఐ న్యూస్, టీవీ-5, వీ-6 వంటి అనేక ఛానెళ్ల పరిస్థితి దినదిన గండంగానే ఉంది. ఇక, తాజాగా తెలుగు లోగిళ్లను బ్రేకింగ్‌లతో ముంచెత్తుతుందని భావించిన ఏపీ టైమ్జ్ ఛానల్ అసలు వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
సీనియర్ జర్నలిస్ట్, కామెంటేటర్ వెంకటకృష్ణ సొంతంగా పెద్ద ఎత్తున తేవాలనుకున్న ఆ ఛానల్ కు ఆదిలోనే గండిపడింది. పార్టనర్స్ మధ్య వచ్చిన విభేదాలే ఇందుకు కారణమంటున్నారు. అమరావతి కేంద్రంగా వచ్చే తొలి తెలుగు న్యూస్ ఛానల్ మాదే అవుతుందని చెప్పారు. ఛానల్ కోసం చాలా నియామకాలు జరిగాయి. కానీ మధ్యలోనే దానికి గండిపడింది. అధికార టీడీపీ వెన్నుదన్నుగా నిలుస్తుందనుకున్నా.. అది జరగలేదు. ఇక, పెద్ద ఎత్తున వైజాగ్ లో న్యూస్ చానల్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన వైటీవీ న్యూస్ విభాగాన్ని ఎత్తివేసింది. ఇక, `ఇమేజ్ టీవీ` మొగ్గలోనే ఆగిపోయింది. ఇప్పుడు చాలా చానల్స్ పరిస్థితి ఇదే!! సో.. తెలుగు టీవీ ఛానెళ్లు.. మేడిపండు మాదిరిగా నెట్టుకొస్తున్నాయి. ఏవో ఓ నాలుగు తప్ప!!