ఊరకరారు మహానుభావులు- అన్నట్టుగానే.. రాజకీయ నేతలు సైతం తమ నోటిని ఊరికేనే పారేసుకుంటారా చెప్పండి? తమకు ఏమీ లాభం చేకూరదన్నప్పుడు అడుగు తీసి అడుగు కూడా వేయని నేతలు.. ఒక్కసారిగా కలకలం సృష్టించేలా? ఒక్కసారిగా తన పేరు బయటకు వచ్చేలా? తన చుట్టూతానే రాజకీయాలు నడిచేలా? తన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగేలా చేశారంటే.. దాని వెనుక స్కెచ్.. ప్లాన్ అంతా ఇంతా ఉంటుందని ఊహించలేం. ఇప్పుడు అలాంటి భారీ స్కెచ్‌తోనే విజయవాడలో మాజీ కమ్యూనిస్టు నేత, ప్రముఖ న్యాయవాది, వైసీపీ నేత పూనురు గౌతంరెడ్డి వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాలపై విమర్శలు గుప్పించారని అంటున్నారు విశ్లేషకులు.
ఒక్క కాపులకే కాకుండా పేదలకు కూడా ఆరాధ్యంగా మారిన మాస్ నేత వంగవీటి రంగా. విజయవాడ కృష్ణలంక, పడమట లంక, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో చాలా మంది ఇళ్లలో రంగా ఫొటో ఉండి తీరుతుంది. అలాంటి మాస్ నేతను చంపడాన్ని సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేసే ధైర్యం నిజానికి గౌతం రెడ్డి వంటి నేతకు లేదనే చెప్పాలి. ఎందుకంటే.. గౌతం రెడ్డికి పెద్ద కేడర్‌కానీ, రంగా రాధాలకు ఉన్నంత ఫాలోయింగ్ కానీ లేవు. వాస్తవానికి చెప్పాలంటే.. రంగా, రాధాను విమర్శించే స్థాయి ఏ రకంగా చూసినా గౌతం రెడ్డికి లేదు.
అలాంటి ఓ చిన్నపాటి నేత, ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న వాడు, ఇప్పుడు ఎందుకు ఇలా సందర్భం కాని ఓ అంశాన్ని తెరమీదకు తెచ్చి రచ్చ చేసినట్టు? అది కూడా అసందర్భంగా ఓ టీవీ చానెల్ విలేకరిని తన ఇంటికి పిలిపించుకుని ఇంటర్వ్యూ ఇచ్చినట్టు? నంద్యాల ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పుడు కానీ, కాకినాడలో ఈ పార్టీ కుదేలైనప్పుడుకానీ నోరు మెదపని ఈ నేత అనూహ్యంగా ఈ ఎన్నికలు అయిపోయి.. అంతా సర్దు మణిగిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు నోరు పారేసుకున్నట్టు? అంటే.. దీనివెనుక చాలా ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుత అంచనాల ప్రకారం 2019లోనూ రాష్ట్రంలో బాబుకే అధికారం ఖాయం అని తెలుస్తోంది. అంటే జగన్‌తో ఉండి ఒరిగేది ఏమీలేదు. అయితే, అదేసమయంలో పూనూరు సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన నేత. గతంలో 2014లోనూ బోండా ఉమా మీద పోటీ భారీ తేడాతో ఓడిపోయాడు. ఇక, ఇప్పుడు ఈయనకు అసలు ఛాన్స్ మిస్సయ్యే పరిస్థితి వచ్చింది. వైసీపీలోకి బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణు వచ్చాడు. దీంతో ఈయన కూడా సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన నేతే కావడం, గౌతం రెడ్డితో పోల్చుకుంటే డబ్బు ఖర్చు పెట్టేందుకు వెనుకాడని నేత.
దీంతో జగన్ వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ టికెట్‌ను ఖచ్చితంగా మల్లాదికే ఇస్తాడు. దీంతో గౌతం రెడ్డి ఆటలో అరిటి పండు అవడం ఖాయం. దీంతోనే ఆయనకు కొందరు టీడీపీ మిత్రులు సాయం చేస్తున్నారని వినికిడి. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ టీడీపీనే అధికారంలోకి వస్తుంది కాబట్టి.. సెంట్రల్ కాకపోయినా.. వేరే చోట నుంచి లేదా నామినేటెడ్ పదవైనా దక్కుతుందని కాబట్టి.. రెడ్డి సామాజికవర్గాన్ని తీసుకుని సైకిలెక్కేయాలని సలహా ఇచ్చినట్టు తెలిసింది. అయితే, నంద్యాల పోరు తర్వాత డిసైడ్ చేస్తానని ఆయన వారికి హామీ ఇవ్వడం జరిగిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
ఇక, ఇప్పుడు పూర్తిగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నాడని, అయితే, తనంత తానుగా పార్టీ మారితే సింపతీ ఉండదు కాబట్టి.. పైగా ఏదైనా సంచలన విషయంతో బయటకు వస్తే.. జగన్ తనను తన సామాజిక వర్గం అని కూడా చూడకుండా వేటు వేశాడని, జగన్‌కు రాజకీయ విలువలు లేవని ఆరోపిస్తూ.. టీడీపీలోకి వచ్చినా ఎవరూ పట్టించుకోరని, గౌతం రెడ్డి ప్లాన్ వేసినట్టు చెబుతున్నారు. మొత్తానికి గౌతం రెడ్డి ప్లాన్ సగం సక్సెస్ అయింది. మరి చంద్రబాబు ఈయనకు ఆఫర్ ఇస్తారో లేదో చూడాలి!!