ప్ర‌భాస్ భారీ రిస్క్‌ … ఇండ‌స్ట్రీలో గుస గుసలు !

యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ కేరీర్‌ను బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌ర్వాత విశ్లేషించొచ్చు. మ‌రోలా చెప్పాలంటే ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే బాహుబ‌లికి ముందు చ‌రిత్ర‌…బాహుబ‌లికి త‌ర్వాత చ‌రిత్ర అన్నంత విభ‌జ‌న రేఖ‌ను బాహుబ‌లి గీసింది. బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ ఏకంగా ఐదేళ్ల కేరీర్ త్యాగం చేశాడు. బాహుబ‌లి 1 రూ.600 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొడితే, బాహుబ‌లి 2 ఏకంగా రూ. 1500 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసి రూ.2 వేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. బాహుబలి సినిమా ప్రభాస్‌ తదుపరి చిత్రం ‘సాహో’పై భారీ అంచనాలను పెంచేసింది. ఎంతలా అంటే సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి స్ధాయిలో ప్రారంభం కాకముందే ఈ సినిమా ఇండియా వైజ్ రైట్స్ రూ.400 కోట్లకు ఓ భారీ డీల్ వ‌చ్చింద‌ట‌. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు.

రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాను యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్‌ సంగీత త్రయం శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ త‌న మార్కెట్ ప‌రిధి పెంచుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు మంచివే అయినా ప్ర‌భాస్ మార్కెట్ బ‌లుపా ? లేదా వాపా ? అన‌్న‌దానిపై ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ప్ర‌భాస్ సాహో సినిమాను మూడు భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నా రూ.150 కోట్లు అంటే మామూలు విష‌యం కాదు. బాహుబ‌లిలో ప్ర‌భాస్ క‌న్నా రాజ‌మౌళి బ్రాండే ఎక్కువ‌. మ‌రి ఇప్పుడు ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ సినిమా విష‌యంలో భారీ రిస్కే చేస్తున్నాడ‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక్క‌డ సినిమా హిట్ అయినా ఆ రేంజ్లో వ‌సూళ్లు వ‌స్తాయా ? అన్న‌ది మాత్రం చెప్ప‌లేం అన్న టాకే ఎక్కువుగా న‌డుస్తోంది.