దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెరపై కనిపించినా తనలో స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి! తన 150వ సినిమా ద్వారా సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఇదే ఊపులో 151వ సినిమాగా డ్రీమ్ ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సైన్ చేసేశాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కనుక.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బాలీవుడ్లో భారీ వసూళ్లు సాధించేందుకు బాహుబలి తరహా మార్కెటింగ్ శైలిని ఫాలో అవ్వాలని చూస్తున్నాడట మెగాస్టార్!! దీంతో తన బాలీవుడ్ లోనూ మెప్పుపొందాలని భావిస్తున్నాడట.
తెలుగు సినిమాకి కొత్త మార్కెటింగ్ పాఠాలు నేర్పించింది బాహుబలి. ఓ సినిమాని ఏ స్థాయిలో మార్కెట్ చేసుకోవొచ్చో, ఎంత వసూలు అందుకొనేలా చేయొచ్చో నిరూపించింది. బాహుబలిని స్ఫూర్తిగా తీసుకొని, తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కడానికి వ్యూహాలు రచిస్తోంది. `ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి`కీ బాహుబలి ఆదర్శంగా నిలవబోతోంది. చిరంజీవి- సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్నఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం కానుంది. మార్కెటింగ్ సూత్రాల విషయంలో బాహుబలిని చిరు టీమ్ ఆదర్శంగా తీసుకోబోతోందట. సినిమా విడుదల తేదీ పక్కాగా ఖరారు చేసుకొని అందుకు నెల రోజుల ముందు నుంచే ముమ్మరంగా పబ్లిసిటీ చేయాలని చిరు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నాడు చిరు. ఇదో.. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉంది. ఆ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తే.. కచ్చితంగా బాలీవుడ్ మెప్పు పొందొచ్చని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. చిరుకి బాలీవుడ్ ప్రేక్షకులు పరిచయమే. ఆజ్ కా గుండారాజ్, ప్రతి బంధ్, ది జెంటిల్మెన్ సినిమాలతో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. బాహుబలికి ఏమాత్రం తీసిపోని విధంగా రూపొందిస్తే చాలు.. చిరు ప్రయత్నం ఫలించినట్టే. మలయాళంలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయాలని, ఆ రూపంలో మల్లూవుడ్‌లోనూ వసూళ్లు కొల్లగొట్టాలని చిరు భావిస్తున్నాడు.