ఉవ్వెత్తున అలలతో ఎగసిపడే సాగర తీరం.. నిరసనలు, దిగ్బంధనలు, పోలీసుల తోపులాటలు, అరెస్టులతో అట్టుడికింది. ఒకనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమించిన విశాఖ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదానికి వేదికగా మారింది. రిపబ్లిక్ డే రోజున బీచ్‌లో యువత చేపట్టిన మౌన నిరసనను ప్రభుత్వం అణిచి వేసింది. అయితే ఈ ఉద్యమంలో గెలిచిందెవరు? జనసేననా లేక ప్రతిపక్ష వైసీపీనా లేక యువతా లేక ప్రభుత్వమా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. మరి దీనికి సమాధానం అధికార పక్ష మీడియా!! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే!!
మీడియా.. ఎప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అక్కడికి వాలిపోయి సెన్సేషన్ చేసేస్తుంది. మరి అలాంటిది విశాఖ కేంద్రంగా యువత నిరసన చేపడితే ఇంకేమైనా ఉందా? అలాంటిది అసలు అక్కడ జరుగుతున్న విషయం గురించి కొన్ని మీడియాల్లో అసలు చూపించనేలేదు. అక్కడ పోలీసులు విద్యార్థులను అణిచివేస్తున్నా.. అరెస్టులు చేస్తున్నా.. కొన్ని మీడియా సంస్థలకు చీమకుట్టినట్టైనా అనిపించలేదు!
ప్రత్యేక హోదాపై తమ ఆవేదనను మౌన ప్రదర్శన ద్వారా వ్యక్తపరచాలనుకుంది యువత! ఓపక్క జనసేన అధినేత ట్వీట్లరతో సపోర్ట్ ఇచ్చారు. ఇంకోపక్క ప్రతిపక్ష నేత వైజాగ్ వచ్చేసి నైతిక మద్దతు ప్రకటించారు. ఈ స్థాయిలో సపోర్ట్ ఉన్నా సరే… అధికార పార్టీ అణచివేత ఎక్కడిక్కడ స్పష్టంగా కనిపించింది. ఉదయం నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. బీచ్ రోడ్డును పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ ఇంత జరుగుతున్నా అధికార పక్షం కొమ్ముకాసే మీడియాలో ఏమీ కనిపించలేదు.
కొన్ని ఛానల్స్‌లో `సాయంత్రం ఐదు గంటల నుంచే విశాఖలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయి. అనుకున్న స్థాయిలో విద్యార్థులు బీచ్‌కి రాలేదు` అంటూ కన్‌క్లూజన్ కూడా ఇచ్చేశారు! దేశంలో ఏదో అత్యవసర పరిస్థితి ఉన్నట్టుగా ఆర్కే బీచ్‌ను అధికారపక్షం అష్టదిగ్బంధనం చేసేస్తే అదెందుకు వీళ్లకి అర్థం కాలేదు? రాజ్యాంగబద్ధంగా వచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉల్లంఘనకు గురవుతున్నట్లు ఎందుకు అనిపించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి!!