మెగాస్టార్ చిరు ప్రతిష్టాత్మకంగా నటించిన 150 మూవీ ఖైదీ ఇప్పుడు సెంటర్ ఆఫ్‌ది టాక్! అదేసమయంలో చిరు కూడా మరింతగా సెంటరాఫ్‌ది టాక్ అయిపోయాడు. సాధారణంగా చిరు గురించి ఎప్పుడు ఏదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంటుంది. కానీ, ఈ దఫా మాత్రం ఆయనపై కొందరు పొలిటికల్ నేతలు కన్నేశారని, ఆయనను పరోక్షంగా వాడుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. నిజానికి పొలిటికల్‌గా పెద్ద ఫాంలో లేని చిరు.. ఇప్పుడు కొన్ని వర్గాల వారికి మాత్రం ఎంతో ఆప్తుడుగా మారిపోయాడని అంటున్నారు.
ఇటీవల చిరు చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయాల కన్నా తనకు మూవీలే ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని కుండబద్దలు కొట్టాడు చిరు. దీంతో అందరూ ఇక, చిరు పాలిటిక్స్‌కి తెరదించేసి.. మూవీలకే పరిమితం అయిపోతాడని అనుకున్నారు. అయితే, ప్రస్తుతం మాత్రం ఆయన రాజ్యసభ ఎంపీనే కావడంతో ఆయనకు, రాజకీయాలకు సంబంధం ఇప్పట్లో తెగేలా కనిపించడంలేదు. మరోపక్క, 2019లో యాక్టివ్ పాలిటిక్స్‌లో మరింత యాక్టివ్ గా దూసుకుపోదామని ప్రయత్నిస్తున్న వారికి చిరు ఓ అందివచ్చిన అస్త్రంగా కనిపిస్తున్నాడట!
అదెలాగంటే.. ప్రస్తుతం ఏపీలో అధికార పీఠం దక్కేందుకు నిర్ణయాత్మక ఓట్లలో అధిక భాగం కాపు సామాజిక వర్గానిదే. దీనిని అండగా చేసుకునే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని కాపులు పెద్ద ఎత్తున చెబుతుంటారు. అయితే, ఇటీవల కాపులు తమ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. ఇదిలావుంటే, ఇదే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్..పై కాపులు ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటికైనా పవన్ తో తమ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు.. పవన్‌ని ఎంతో మచ్చిక చేసుకునేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై పవన్ ఎన్ని విమర్శలు చేసినా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు.
అంటే, కాపు సామాజిక ప్రతినిధిగా బాబు.. జనసేనాని చూస్తున్నారు. ఈయనను అండగా చేసుకుని మరోసారి 2019లో అధికారంలోకి వచ్చే అవకాశంపై ఆలోచన చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అదేసమయంలో బాబు వ్యతిరేకంగా ఉన్న కొందరు దాసరి నారాయణరావు, సుబ్బరామిరెడ్డి వంటి వారు ఇప్పుడు చిరును చేరదీసే పనిలో ఉన్నారని అంటున్నారు. ప్రత్యక్షంగా కాపు సామాజిక వర్గం తరఫున అంటూ చిరును ఆహ్వానించకపోయినా.. ఇటీవల సుబ్బరామి రెడ్డి చిరును ఘనంగా సన్మానించారు. అదేవిధంగా దాసరి కూడా చిరుకు ఆహ్వానం పంపారట. ఇలా.. పవన్ ఓ పక్క దూసుకుపోతుంటే.. అన్నయ్యను ఇలా మచ్చిక చేసుకోవడం వెనుక పాలిటిక్స్ ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.