ఏపీ టీడీపీలో కొత్త ఎమ్మెల్సీలు ఎవరు..!

రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. అందులో గెలిస్తే ఎమ్మెల్యే.. ఒక‌వేళ ఓడితే ఐదేళ్ల పాటు ప‌వ‌ర్‌లో లేకుండా ఉండాల్సిందే! దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఆశావ‌హుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏపీలో త్వ‌ర‌లో ఎమ్మెల్సీ నగారా మోగ‌నుంది. ప్రస్తుతం దాదాపు 22 స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికయ్యేవారు ఏడుగురు ఉన్నారు. ఇందులో ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 6 వైకాపాకు ఒక స్థానం లభించనున్నాయి. అటు పార్టీలోకి కొత్త‌గా చేరిన వారితో పాటు.. పార్టీలో ఎన్నోఏళ్లుగా ఉన్న వారు ఎమ్మెల్సీ ఆశ‌లు పెట్టుకుంటున్నారు. సీఎం దృష్టిలో ప‌డే ఆ ఆరుగురు నేతలు ఎవరనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

తెదేపా తరపున సీటు ఆశించేవారి సంఖ్య భారీగా ఉంది. ప్రధానంగా కృష్ణా జిల్లా నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి – న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ – పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు – పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జి నాగుల్మీరా ఎవరికివారు తమ రాజకీయ గాడ్ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే వీరితో అర్జునుడు గత ఎన్నికల్లో నూజివీడు సీటు ఆశించారు. తీరా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన గన్నవరం మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆ సీటును దక్కించుకున్నా గెలువలేకపోయారు. ప్రస్తుతం అర్జునుడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.

ఇక నాగుల్ మీరా..  జలీల్ ఖాన్ (వైకాపా) చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తరువాత నియోజకవర్గ ఇన్ చార్జిగా వ్యవహరిస్తూ గత ఎన్నికల్లో తిరిగి సీటు నాశించగా ఆఖరి క్షణంలో మిత్రపక్ష బీజేపీకి వదలాల్సి వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీలోకి ప్రవేశించడంతో వచ్చే ఎన్నికల్లో కూడా సీటు రాదనే భావనతో ఆయన ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. అయితే మైనార్టీ కార్పొరేషన్ నుంచి దూదేకుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటుచేసి నాగుల్ మీరాను చైర్మన్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక గొట్టిపాటి టిడిపి తరపున ప‌శ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలోని శిక్షణ కేంద్రానికి ఇన్‌చార్జిగా ఉంటూ 10వేల మంది కార్యకర్తలకు శిక్ష‌ణ ఇచ్చారు.

ఇక గుంటూరు జిల్లాలో మాజీ శాసనసభ్యులు జియావుద్దీన్ డాక్టర్ చందు సాంబశివుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బరావు పోటీ పడుతున్నారు. ఇదిలావుంటే రాజధాని ప్రాంత కృష్ణా – గుంటూరు జిల్లాలకు టీడీపీ ఒక స్థానం కేటాయించనుండటంతో ఆ సీటును ఆశించేవారి సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. రాజధాని ప్రాంతంలో తమ ప్రాబల్యం పెంచుకోటానికి కూడా ఎమ్మెల్సీ పదవి ఎంతగానో దోహదపడుతుందనే భావన ఆశావహుల్లో లేకపోలేదు.