టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం తర్వాత తన కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 లో నటిస్తున్నాడు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూ ట్యూబ్‌లో దుమ్ము లేపుతోంది. ఈ సినిమా తరువాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారన్న విషయమై రకరకాల వార్తలు విన్పిస్తున్నాయి.
చిరు 151వ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ఇలా పలువురు పేర్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా శంకర్ దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో షికార్లు చేస్తున్నా యి. శంకర్ – చిరు కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు కదా.
అయితే శంకర్ డైరెక్షన్లో చిరు నటించేది పూర్తి స్థాయి సినిమా కాదులెండి. శంకర్ డైరెక్షన్లో రజనీకాంత్ నటిస్తోన్న 2.0 సినిమాలో చిరు గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను 2017 దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టేందుకు దర్శకుడు శంకర్ ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ప్రాంతీయ భాషల్లోను క్రేజ్ కోసం శంకర్ సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరుతో ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయించేందుకు శంకర్ ప్లాన్లు వేస్తున్నారట.
రజనీకాంత్, చిరంజీవి కలిసి తెరపై కనిపిస్తే అభిమానులకు పండుగే. గతంలో వీరిద్దరు ‘కాళీ’, రాణువ వీరన్,‘మాప్పిళై’ చిత్రాల్లో కలిసి నటించారు.