ప‌వ‌న్‌కు ప‌వ‌ర్ ఎప్పుడు జ‌త క‌లిసింది…?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఏంటో ఇప్ప‌డు కొత్త‌గా ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్ న‌డిచొస్తే ప‌వ‌ర్…. ప‌వ‌న్ పంచ్ డైలాగుల్లో ప‌వ‌ర్‌.. ఆయ‌న న‌రం, నాడి, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నింటిలోనూ ప‌వ‌ర్‌ను చూసుకునే అసంఖ్యాక అభిమానులు తెలుగునాట ఆయ‌న‌ను ఆ ప‌దానికి ప‌ర్యాయ‌ప‌దంగా మార్చేశారు. ప‌వ‌న్ అన్న చిరంజీవిని మెగాస్టార్‌గా ఫ్యాన్స్ ఎలా ఫిక్స‌య్యారో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను ప‌వ‌ర్‌స్టార్‌గా ఫిక్స‌యిపోయారు. పవర్ స్టార్ గా ప‌వ‌న్ కూడా అంతే ఫేమస్. తన ఎన‌ర్జీతో బాక్స్ ఆఫీసును షేక్ చేసే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌వ‌ర్‌స్టార్ అనే బిరుదు ఎవ‌రిచ్చార‌న్న విష‌యం చాలా ఆస‌క్తిక‌ర‌మైందే.

ప‌వ‌న్‌ను ఇలా మొద‌టిగా పిలిచింది పోసాని కృష్ణ ముర‌ళి. అవును స్వ‌యంగా పోసాని కృష్ణమురళియే ఈ విష‌యం చెప్పాడు. పవన్ కు ‘పవర్ స్టార్’ బిరుదు ఇచ్చింది తానే అని ఆయన రామ్‌చ‌ర‌ణ్ తాజా చిత్రం ‘ధృవ’ ప్రి రిలీజ్ ఫంక్షన్లో పోసాని వెల్లడించాడు. ఈ వేడుకలో అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తుండగా పోసాని కృష్ణ‌ముర‌ళి ఈ విషయం వెల్లడించ‌డంతో ప‌వ‌న్ అభిమానుల నినాదాలు మిన్నంటాయి..

పోసాని సీనియ‌ర్ సినీ రైట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే.. ప్ర‌ముఖ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య వ‌ద్ద పోసాని ప‌నిచేశాడు. సుబ్బయ్య దర్శకత్వంలోనే పవన్ త‌న రెండో సినిమా ‘గోకులంలో సీత’ చేశాడు. ఆ సందర్భంగానే తాను పవన్ కళ్యాణ్‌ను మొద‌టిసారిగా పవర్ స్టార్ అని పిలిచాన‌ని.. దానికి త‌గ్గ‌ట్టుగానే త‌ద‌నంత‌ర కాలంలో పవన్… నిజంగానే ఆ బిరుదును నిజం చేశాడ‌ని పోసాని వెల్ల‌డించాడు.