చంద్ర‌బాబుపై ఆ ఇద్ద‌రు మంత్రుల గుర్రు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం త‌యార‌వుతోందా? త‌న మంత్రుల‌కే త‌న‌కు విమ‌ర్శ‌కులుగా మారుతున్నారా? ఒక‌రిద్ద‌రు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన ఓ స‌మావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి మా బాస్ అనుమ‌తించ‌డం లేదంటూ నేరుగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు బాణాలు ఎక్కుపెట్ట‌డం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి ప్ర‌భుత్వానికి ఆదాయం ఇచ్చే వాటిలో ఎక్సైజ్ త‌ర్వాత రెవెన్యూదే ప్ర‌ధాన వాటా. అలాంటి శాఖ‌ను కేఈకి అప్ప‌గించారు.

అయితే, ఇటీవ‌ల కాలంలో రాష్ట్ర ఆదాయం త‌గ్గిపోవ‌డంతో రెవెన్యూపై సీఎం చంద్ర‌బాబు ఒకింత ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే కేఈ త‌న అసంతృప్తిని బ‌య‌ట పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లాలు చాలా ప‌రిశ్ర‌మ‌లు ఇచ్చేశామ‌ని ముఖ్య‌మంత్రి చెబుతార‌నీ, వాస్త‌వంలో శంకుస్థాప‌న‌కు నోచుకున్నవి ఎన్ని ఉన్నాయంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. అదేస‌మ‌యంలో ఆంధ్రాకి కోటాను కోట్లు పెట్టుబ‌డులు వ‌చ్చేశాయ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నార‌నీ, వాస్త‌వంలో వ‌చ్చింది అంత మొత్తం ఉండ‌ద‌ని కేఈ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఇక‌, విశాఖ‌కు చెందిన మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా చంద్ర‌బాబుపై గుస్సాగానే ఉన్నారు. త‌న‌పై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌ను సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. పైకి మౌనంగా ఉంటున్నా.. చంద్ర‌బాబు.. మాత్రం గంటాపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో గంటా కూడా సీఎంపై గుర్రుగానే ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వ‌ంలో మూడు అధికార కేంద్రాలు ఉన్నాయ‌నీ, ఏం జ‌రిగినా వారే చేసుకుంటార‌నీ, ఇత‌రుల‌కు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌ర‌ని ఆ మంత్రి అంటున్నార‌ట‌. సో.. ఇలా సీనియ‌ర్ల‌నుకున్న మంత్రులే బాబుపై బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం అంద‌రికీ విస్మ‌యం క‌లిగిస్తోంది. మ‌రి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.