కేసీఆర్ ఇంట్లో బంగారం లెక్క ఇదే

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దెబ్బ‌కి.. దేశంలో ఇప్పుడు ఎవ‌రిని క‌దిపినా.. మీ ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బుంది? అంటే.. మీ ద‌గ్గ‌ర ఎంత గోల్డుంది? అనే చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. అంతేకాదు, సీఎంలు వెళ్లి పీఎంను క‌లిసినా.. కూడా ఇదే చ‌ర్చ న‌డుస్తోంద‌ని సాక్షాతూ తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. బ్లాక్ మ‌నీపై పెద్ద నోట్ల‌ ర‌ద్దు స్టైకింగ్ తో విరుచుకుప‌డిన ప్ర‌ధాని మోడీపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత కొన్నాళ్లు మోడీని ప‌రోక్షంలో తిట్టిపోయిన కేసీఆర్ కూడా ఇప్పుడు మోడీకి జై కొడుతున్నారు. నోట్ల ర‌ద్దును మెచ్చుకుంటున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో మోడీ నిర్ణ‌యంపై చ‌ర్చ చేప‌ట్టిన కేసీఆర్‌.. మోడీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు, మ‌నం అంద‌రం న‌గ‌దు ర‌హితం దిశ‌గా మారాల‌ని పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలోనే మోడీ ద‌గ్గ‌ర త‌న‌కు ఎదురైన ఓ అనుభ‌వాన్ని టీఆర్ ఎస్ అధినేత అసెంబ్లీ వేదిక‌గా అంద‌రితోనూ పంచుకున్నారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత తాను ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు, తెలంగాణ క‌ష్టాల‌ను వివ‌రించేందుకు తాను మోడీని క‌లిసిన‌ట్టు చెప్పారు. ఈ సంద‌ర్భంగా మోడీకి త‌న‌కు మ‌ధ్య న‌గ‌దు ర‌ద్దు స‌హా.. బంగారంపై ఆంక్ష‌ల విష‌యం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింద‌న్నారు.

ఈ స‌మ‌యంలో మోడీ.. త‌న‌ను మీ ద‌గ్గ‌ర బంగారం ఎంత మేర‌కు ఉంద‌ని ప్ర‌శ్నించ‌డంతో తాను త‌డుముకోకుండా త‌న కుటుంబం(అంటే.. కేసీఆర్‌, ఆయ‌న భార్య‌) మొత్తం ఎంత బంగారం క‌లిగి ఉందో వివ‌రించిన‌ట్టు కేసీఆర్ వివ‌రించారు. త‌న ద‌గ్గ‌ర మూడు బంగారపు ఉంగ‌రాలు, ఒక చైను, త‌న భార్య శోభ ద‌గ్గ‌ర 50-60 తులాల బంగారం ఉంద‌ని మోడీకి చెప్పిన‌ట్టు కేసీఆర్ వివ‌రించారు.

దీంతో తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ బంగారం లెక్క‌ల పైనే ఆస‌క్తి నెల‌కొంది. ఒక‌రిద్ద‌రు స‌భ్య‌లు 50 తులాలంటే.. ఎన్ని గ్రాముల‌ని చ‌ర్చించుకోవ‌డం క‌నిపించింది. ఇలా.. కేసీఆర్ త‌న ఇంట్లో బంగారం లెక్క‌ల‌ను అటు ప్ర‌ధాని మోడీ నుంచి ఇటు తెలంగాణ ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ర‌కు వెల్ల‌డించేశారు. సో.. ఇదే కేసీఆర్ గోల్డ్ లెక్క‌! ప‌క్కాగానే ఉంది క‌దూ..!