ఆ యుద్ధ‌క్షేత్రంపై జ‌గ‌న్ గురి..!

ఏపీ రాజ‌ధాని జిల్లా గుంటూరు ల‌క్ష్యంగా వైకాపా అధినేత జ‌గ‌న్ భారీ ఎత్తున రాజ‌కీయానికి తెర‌దీస్తున్నారా? ఈ జిల్లాను టార్గెట్ చేయ‌డం ద్వారా టీడీపీకి పెద్ద షాక్ ఇవ్వాల‌ని భావిస్తున్నారా? ప‌్ర‌స్తుతం రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అయిన వైకాపాను జిల్లా మొత్తం విస్త‌రించాల‌ని ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారా? అంటే తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజ‌కీయాల్లో గుంటూరు జిల్లా గుండెకాయ వంటిది. అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స‌హా మంత్రులు ప‌త్రిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబులు ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో.. గుంటూరు ఒక‌టి.

దీంతో జ‌గ‌న్ ఈ జిల్లాను త‌న హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం ద్వారా టీడీపీని ధీటుగా ఎదుర్కోవ‌చ్చ‌ని ప్లాన్ వేశారు. ఈ క్ర‌మంలోనే జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా వైకాపా ముద్ర ఉండేలా ఆయ‌న స్కెచ్ గీస్తున్నారు. ముఖ్యంగా ప‌ల్నాడు ప్రాంతంలోనూ వైకాపా వేళ్లూనుకునేలా జ‌గ‌న్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం న‌ర‌స‌రావు పేట‌, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, వీటితోపాటు.. గుర‌జాల‌, వినుకొండ‌, స‌త్తెన‌ప‌ల్లి వంటి ప‌ల్నాడుకు గుండెకాయ వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైకాపా జెండా ఎగిరేలా జ‌గ‌న్ ప్లాన్ సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

తాజాగా, కాసు స‌తీష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్న జ‌గ‌న్‌.. ఈ సంద‌ర్భంగా న‌ర‌స‌రావుపేట‌లో భారీ ఎత్తున స‌భ నిర్వ‌హించారు. ఇది స‌క్సెస్ కూడా అయింది. ఈ క్ర‌మంలోనేఆయ‌న త‌న పంథాను ప‌రోక్షంగా వివ‌రించారు. రాబోయే రోజుల్లో ప‌ల్నాడులో వైకాపా జెండా ఎగిరేలా స‌భావేదిక‌పైనే సంచ‌ల‌న నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో వైకాపాను పెంచి పోషించిన జంగా కృష్ణ‌మూర్తిని ప‌క్క‌కు పెట్టి.. నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను కాసుకి అప్ప‌గించారు. ఈ నిర్ణ‌యం వైకాపాలో ఏమోకానీ, టీడీపీలో మాత్రం సంచ‌ల‌నం సృష్టించింది.

గుర‌జాల టీడీపీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు.. జ‌గ‌న్‌పై ఫైర‌య్యారంటే.. కాసు, య‌ర‌ప‌తినేని ల మ‌ధ్య రాబోయే రోజుల్లో ఫైటింగ్ ఏ రేంజ్‌లో జ‌ర‌గ‌బోతోందో అర్ధం చేసుకోవ‌చ్చు. అదేవిధంగా వినుకొండ విష‌యంలోనూ జ‌గ‌న్ ఇప్ప‌టికే పటిష్ట నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇక్క‌డ పార్టీ వ్య‌వ‌హారాలు చూస్తున్న న‌న్న‌ప‌నేని సుధ‌ను త‌ప్పించి.. ఆ బాధ్య‌త‌ల‌ను బొల్లా బ్ర‌హ్మ‌నాయుడికి అప్ప‌గించారు. ఫ‌లితంగా స్థానికంగా మంచి ప‌ట్టుకున్న బొల్లా పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిపిస్తాడ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఇక‌, స‌త్తెనప‌ల్లి విష‌యానికి వ‌స్తే.. ఇది ప్ర‌స్తుతం స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ప్రాతినిధ్యంలో ఉంది. ఇక్క‌డ కూడా రాబోయే రోజుల్లో వైకాపా నేత అంబ‌టి గెలిచేలా ఆయ‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇలా.. ప‌ల్నాడులోని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ 2019 ఎన్నిక‌ల్లో వైకాపా జెండా ఎగిరేలా జ‌గ‌న్ దూసుకుపోతున్నాడ‌న్న‌మాట‌!! ఏం జ‌రుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.