సెంటిమెంట్ రాయుడిగా మారిన రేవంత్‌రెడ్డి

ఇటీవ‌ల రాజ‌కీయాలు సెంటిమెంట్‌గా మారిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్య‌మం నుంచి ఈ సెంటిమెంట్ ఎక్కువైపోయింది.  ఈప‌ని ప్రారంభించాల‌న్నా కొబ్బ‌రికాయ ప‌గ‌లాల్సిందే! నుదుటిన వీర తిల‌కం దిద్దాల్సిందే టైపులో ప్ర‌తి ప‌నికీ సెంటిమెంట్‌తో ముడి పెడుతున్నారు. తాజాగా తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సెంటిమెంట్ రాయుడిగా మారిపోయారు! నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల్ని, చంద్ర‌బాబుని ఎంత‌గానో న‌మ్మిన రేవంత్ ఇప్పుడు.. కేవ‌లం సెంటిమెంట్‌ను మాత్ర‌మే న‌మ్ముతున్నారు. అదే త‌న‌కు క‌లిసివ‌స్తోంద‌ని బ‌హిరంగంగానే రేవంత్ చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల కాలంలో టీ టీడీపీ ప‌రిస్థితి ఏమంత బాగోలేదు. జంప్ జిలానీలు ఎక్కువైపోయారు. దీంతో పార్టీని ర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త‌ను రాష్ట్ర నేత‌ల‌కే అప్ప‌గించారు టీడీపీ జాతీయ సార‌ధి చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. మొన్నామ‌ధ్య ఎన్‌టీఆర్ భ‌వ‌న్‌కి వ‌చ్చారు. అయితే, వ‌చ్చే ముందు ఆయ‌న స్థానిక‌ పెద్దమ్మతల్లి దేవాలయం నుంచి సైకిల్ పై బ‌య‌లు దేరారు. ఇక పై ఏ కార్యక్రమమైనా పెద్దమ్మతల్లి ఆశీస్సులతో చేపడతానని కూడా ప్రకటించారు. గ‌తంలో ఎప్పుడు ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా రేవంత్ ఇంత సెంటిమెంట‌ల్‌గా ఆలోచించ‌లేదు.

ఇక‌, పెద్దపల్లిలో రైతు పోరు యాత్ర సందర్భంగా మ‌రో  సెంటిమెంట్‌ని రేవంత్ తెర మీదకు తెచ్చారు. భూపాలపల్లి నుంచి రైతు పోరు యాత్ర ప్రారంభించిన తనకు, పార్టీ సీనియర్ నేత సీతక్క కుంకుమతో వీరతిలకం దిద్ది ఆశీర్వదించి, యాత్ర ప్రారంభింపజేశారని చెప్పారు.  ఈ సంఘటనను రేవంత్ సెంటిమెంట్ గా భావిస్తున్నారట. నాటి వైఎస్ చేవెళ్ల చెల్లెమ్మ‌(స‌బితా ఇంద్రారెడ్డి) సెంటిమెంట్‌ను గుర్తు చేసుకున్న రేవంత్ త‌న‌కు కూడా విజ‌యం త‌ధ్య‌మ‌ని చాటించారు.

వాస్త‌వానికి తాము చేస్తే ఒప్పు.. గిట్ట‌నివాడు చేస్తే త‌ప్పుగా చెప్పే.. టీడీపీ ఈ విష‌యంలోనూ స‌మ‌ర్ధించుకుంది. సెంటిమెంట్లు, యాగాల‌పై కేసీఆర్‌ను ద‌మ్మెత్తి పోసే.. టీ టీడీపీ నేత‌లు రేవంత్‌ను స‌మ‌ర్ధిస్తున్నారు. ఇది రేవంత్ సొంత ఖ‌ర్చుఅని, కేసీఆర్ ప్ర‌జాధ‌నంతో సెంటిమెంట్ చేస్తున్నార‌ని అంటున్నారు. సో.. ఇదీ టీ టీడీపీ సెంటిమెంట్‌!! మ‌రి ఈ సెంటిమెంట్లు రేవంత్‌ను ఎంత వ‌ర‌కు సీఎం చేస్తాయో చూడాలి.