జ‌న‌సేన‌ది ఒంట‌రి పోరే..

ప్ర‌ముఖ సినీ క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త‌క్ష్య రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ఆయన టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చి వారికి అనుకూలంగా ప్ర‌చారం కూడా చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న‌ ప‌రిస్థితులు… బీజేపీపై కాస్త గ‌ట్టిగా… టీడీపీపై కాస్త సుతిమెత్త‌గా విమ‌ర్శ‌లు చేస్తోన్న ప‌వ‌న్ వైఖ‌రిని చూశాక మ‌రి  జ‌న‌సేన‌ వ‌చ్చే ఎన్నికల్లో సొంతంగానే బ‌రిలోకి దిగుతుందా..?  లేక ఇప్ప‌టిదాకా మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఎన్డీఏ తో పొత్తు రాజ‌కీయాల‌కు సిద్ధ‌మ‌వుతుందా అనేది స్ప‌ష్టంగా తేల‌టంలేదు.

తాజాగా బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ చేసిన‌ వ్యాఖ్య‌లు చూస్తే… ఎన్డీఏ కూట‌మికీ జ‌న‌సేనకు సంబంధాలు అంత స‌జావుగా లేవ‌నే తెలుస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంలో కేంద్రంలోని బీజేపీతో ప‌వ‌న్ తీవ్రంగా విభేదిస్తున్నవిష‌యం తెలిసిందే. ఇదే అంశంపై కేంద్రంతో పోరాటానికి కూడా సిద్ధ‌మేన‌ని జ‌న‌సేన అధినేత బ‌హిరంగ‌స‌భలు పెట్టి మ‌రీ బీజేపీని క‌డిగి పారేశారు. కేంద్రం ఏపీకి రెండు పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చింద‌ని తీవ్ర ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు చేశారు. ఈ విష‌యంలోనే ఆయ‌న బీజేపీ- టీడీపీ కూట‌మికి దూరంగా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

బీజేపీ నేత సిద్ధార్థ‌నాథ్‌సింగ్ బుధ‌వారం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ జ‌న‌సేన‌తో పొత్తు అంశంపై పెద్ద బాంబు పేల్చారు. గ‌త‌ ఎన్నిక‌ల్లో  జనసేన పార్టీ .. బీజేపీతో జతకట్టలేదని,  ఎన్నికల సమయంలో జనసేన తమ పార్టీకి మద్దతు మాత్రమే తెలిపిందని చెప్పారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీతో తమకు ఎలాంటి విభేదాలూ లేవని ఆయ‌న తేల్చి చెప్పారు.ఈ నెల 26న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తామని, ఈ ర్యాలీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నట్టు కూడా సిద్ధార్థ్ నాథ్  వెల్ల‌డించారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీతో మిత్ర‌ప‌క్షంగా ఉండ‌ట‌మే త‌మ‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మ‌ని బీజేపీ తేల్చేసిన‌ట్టుగా భావించ‌వ‌చ్చు. మ‌రిప్పుడు ప‌వ‌న్ ఒంట‌రిపోరుకు సిద్ధ‌మ‌వుతారా..లేక వామ‌ప‌క్షాల‌తో క‌లిసి మ‌రో కూట‌మికి తెర‌తీస్తారా.. అన్న‌ది వేచిచూడాల్సిఉంది. అయితే ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్ల సుదీర్ఘ స‌మ‌యం ఉన్న కార‌ణంగా ఈ స‌మీక‌ర‌ణ‌లు స‌మూలంగా మారిపోయే అవ‌కాశాల్నీ ఏ మాత్రం కొట్టిపారేయలేం సుమా…!