ఆ ప‌శ్చిమ టీడీపీ ఎమ్మెల్యే రూ.20 కోట్లు పంచాడా..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు సంచ‌ల‌న నిర్ణ‌యం నిజంగానే పెద్ద‌ల‌ను ఇబ్బందులు పెడుతోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా లెక్క‌లు చూప‌ని కొన్ని కోట్ల పెద్ద నోట్లు.. త‌గ‌ల పెట్టార‌ని, చించి పోస్తున్నార‌ని వార్త‌లు, స‌చిత్ర క‌థ‌నాలు క‌నిపిస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో పెద్ద‌లు త‌మ బ్లాక్ మ‌నీని తమ కుటుంబ స‌భ్యుల‌కు పంచుతున్నారు. వారి పేర్ల‌తో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. మొత్తానికి పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం బ్లాక్ మ‌నీని అరిక‌ట్టేందుకేన‌న్న ప్ర‌ధాని మోడీ ఉద్దేశం కొద్దిలో కొద్దిగా కార్చాచ‌ర‌ణలో వ‌చ్చింది.  ఇక‌, ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ గోదావ‌రిలో ఓ టీడీపీ ప్ర‌ముఖ ఎమ్మెల్యే త‌న వ‌ద్ద ఉన్న బ్లాక్ మ‌నీని వ‌దిలించుకునేందుకు పెద్ద ఆలోచ‌నే చేసిన‌ట్టు తెలుస్తోంది.

త‌న వ‌ద్ద ఉన్న కోట్ల కొద్దీ ధ‌నాన్ని మార్చుకునేందుకు ఆయ‌న వేసిన ట్రిక్ అదిరిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ఈయ‌న ఏకంగా త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బును త‌న కుటుంబ స‌భ్యుల‌కు అనుచ‌రుల‌కే కాకుండా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఒక్క‌రికీ పంచి పెట్టాడ‌ట‌. దానికి గాను ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు బాధ్యత అప్ప‌గించారు. అయితే, ఇక్క‌డ ష‌ర‌తు ఏంటంటే… ఇలా ఇచ్చిన డ‌బ్బును తీసుకున్న‌వాళ్లు.. ఖ‌చ్చితంగా ఏడాది త‌ర్వాత తిరిగి కొత్త నోట్ల రూపంలో ఇచ్చేయాలి. అయితే, ఈ ఏడాదిపాటు ఎలాంటి వ‌డ్డీ చెల్లించాల్సిన ప‌నిలేదు. దీంతో ఇదేదో బాగుంద‌ని అంద‌రూ ఎగ‌బ‌డి మ‌రీ ఆ ఎమ్మెల్యేగారి సొమ్మును తీసేసుకుంటున్నార‌ట‌.

ఇలా.. ఇప్ప‌టికి సుమారు 20 కోట్ల పెద్ద నోట్లు పంచేశార‌ట‌. ఈ క్ర‌మంలో డ‌బ్బులు తీసుకున్న అంద‌రి ద‌గ్గ‌రా.. ప్రామిస‌రీ నోట్లు రాయించుకుంటున్నార‌ట‌. ఇక‌, ఈ వార్త దావాల‌నం మాదిరిగా.. వ్యాపించి.. విష‌యం టీడీపీ త‌మ్ముళ్ల‌కు చేరింద‌ట‌. దీంతో వారంతా అస‌లా ఎమ్మెల్యేకి అంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌ని ఆరాతీయ‌డం ప్రారంభించార‌ట‌. ఈ క్ర‌మంలో మ‌రో 30 కోట్ల రూపాయ‌లు పంచేందుకు అన్నీ రెడీ కూడా చేసుకుని మ‌రీ.. వెన‌క్కి త‌గ్గారు. దీంతో ప్ర‌స్తుతం ఈ టాపిక్ ప‌శ్చిమ గోదావ‌రిలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

ఇక‌, ఇప్పుడు మిగిలిన సొమ్మును ఎలా స‌ర్క్యులేట్ చేస్తార‌నే విష‌యం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మ‌రోప‌క్క‌, ఇప్పుడు డ‌బ్బులు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తారా? అంటే.. ఆ ఎమ్మెల్యే మాత్రం ఎంతో భ‌రోసాగా ఉన్నారు. తన త‌డాఖా ఏంటో తెలుసుగా అని కూడా ఎదురు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదీ ఇప్పుడు ప‌శ్చిమ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్ద నోట్ల పందేరం!!