హైద‌రాబాద్ రోడ్ల‌లో భారీ స్కామ్‌..!

విశ్వాసం క‌లిగించ‌లేక‌ పోతున్నాయి. అవును మ‌రి హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం రోడ్ల దుస్థితి చూస్తే ఎవ‌రికైనా అలాగే అనిపిస్తుంది మ‌రి. భాగ్య‌న‌గ‌రంలో గ‌ట్టిగా వ‌ర్షం కురిస్తే.. జ‌న‌జీవ‌నం ఏ స్థాయిలో అస్త‌వ్య‌స్తం అవుతుందో ఇటీవ‌ల అంద‌రికీ స్ప‌ష్టంగానే తెలిసొచ్చింది.

న‌గ‌రంలో ప్ర‌జలకు రోడ్లు ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్నే చూపిస్తున్నాయ‌ని చెప్పాలి. కనీసం గుంతలు పూడ్చించలేని ప్రభుత్వ నిర్వాకం.. న‌గ‌ర వాసుల్లో ఆగ్ర‌హం ర‌గిలిస్తోంది. ఈ వ్య‌వ‌హారం ఇలా ఉండ‌గా.. మరోవైపు, పూడ్చని గుంత‌లకు, వేయ‌ని రోడ్లకు కూడా కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలంటూ క్లెయిం చేశారని ప్ర‌స్తుతం మీడియాలో వార్త‌లు వ‌స్తుండ‌టం.. మరింత విడ్డూరంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం తెలుసుకుని.. తెలంగాణ ప్ర‌భుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ మండిపడ్డారని సమాచారం.

ఈ స్కాంపై స్పందించిన సీఎం కేసీఆర్ సైతం బిల్లుల చెల్లింపుతో సహా పూర్తి వివరాలు పంపాలని ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. న‌గ‌రంలో కొన్ని ప్రధాన రోడ్లలో పైపైన గుంతలు పూడ్చిన విష‌యం వాస్త‌వ‌మే. పంజాగుట్ట ఫ్లై ఓవర్ పైనా నామ్ కే వాస్తేగా… ఒక లేయర్ వేశామని అనిపించినా… అప్పుడే మళ్లీ దానిపై గుంతలు ప‌డి ప‌రిస్థితి మొద‌టికొచ్చింది. నగరంలో 90 శాతం పైగా రోడ్లపై గుంతలు ఇప్ప‌టిదాకా పూడ్చనే లేదు. మ‌రి బిల్లులు మాత్రం భారీగానే వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

మున్సిపల్ శాఖ‌ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం రోడ్ల ప‌రిస్థితిపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను తానూ ప‌రిశీలిస్తున్నాన‌ని  అన్న‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి.  అయితే ప్ర‌స్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇక మిగిలిన టీఆర్ఎస్ మంత్రుల‌కు స్వ‌యం ప్ర‌కాశ శ‌క్తి ఎలాగూ లేదు.. స్వ‌యం నిర్ణ‌యాధికార శ‌క్తి అయినా ఏమేరకుందోన‌నేది అనుమాన‌మే.

ఈ ప‌రిస్థితుల్లో  విశ్వ‌నగరంలో రోడ్ల మరమ్మతులు ఎప్ప‌టికి జ‌రిగేనో అన్న‌ది పెద్ద ప‌జిల్‌గా మారింది. ఈ సంద‌ర్భంగా సంద‌ట్లో సడేమియా గా, కొందరు కాంట్రాక్టర్లు మాయాజాలానికి తెర తీసినట్టు తెలుస్తోంది. త‌ట్ట‌ మట్టి కూడా పొయ్యని రోడ్లను సైతం .. మ‌ర‌మ్మ‌తులు చేసేసిన‌ట్టు బిల్లులు పెట్టారట. ఇలా దాదాపు 100 కోట్ల రూపాయల దాకా స్కామ్ జరిగిందని, ఏ యే ప్రాంతాల‌కు సంబంధించి జ‌ర‌గ‌ని ప‌నుల‌కు బిల్లుల‌కు పెట్టారో కూడా స‌వివ‌రంగా  ఓ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌లో క‌థ‌నాలు రావ‌డంతో ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.  ఈ వ్య‌వ‌హారంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.