కేసీఆర్ క‌ల నెర‌వేరేనా?

బంగారు తెలంగాణ సాకారం పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేప‌ట్టిన జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్త‌యి.. స‌ద‌రు కొత్త జిల్లాల ప్రారంభం కూడా జ‌రిగిపోయింది. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా పెద్ద ఎత్తున జ‌రిగిన ఆయా జిల్లాల ఏర్పాటును మంత్రులు ప్రారంభించారు. దీంతో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం 21 కొత్త జిల్లాల‌తో మొత్తంగా 31 జిల్లాల తెలంగాణ‌గా ఆవిర్భ‌వించింది. దీంతో పాల‌న క్షేత్ర‌స్థాయికి వెళ్తుంద‌ని, పాల‌నా ఫ‌లాలు ప్ర‌తి ఒక్క‌రికీ చేరువ అవుతాయ‌ని, అవినీతి న‌శిస్తుంద‌ని, కొత్త నేత‌లు పుట్టుకువ‌స్తార‌ని, అధికారుల సేవ‌లు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతాయ‌ని ఫ‌లితంగా బంగారు తెలంగాణ సాకారం అవుతుంద‌ని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అయితే, ఇది ఎంత‌వ‌ర‌కు సాధ్య‌మో ఇప్పుడు చూద్దాం.

దేశంలో స్వాతంత్య్రం వ‌చ్చాక ఏర్ప‌డిన రాష్ట్రాల్లో జిల్లాల విభ‌జ‌న, కొత్త జల్లాల ఏర్పాటు కూడా జ‌రిగిపోయింది. అయితే, పెద్ద రాష్ట్రాలే అయిన‌ప్ప‌టికీ జిల్లాల సంఖ్య‌లో ప‌రిమితంగా ఉన్న రాష్ట్రాలూ ఉన్నాయి. మ‌రి వాటిని గ‌మ‌నించిన‌ప్పుడు వాటి అభివృద్ధి ఎలా ఉందో చూద్దాం. దేశంలో విస్తీర్ణం స‌హా జ‌నాభాలో పెద్ద జిల్లా అయిన ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో 75 జిల్లాలు ఉన్నాయి. కానీ, అభివృద్ధిలో మాత్రం ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌చందంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా నేర రికార్డులో కూడా ఈ రాష్ట్రం ముందు వ‌రుస‌లో ఉంది. ఇక‌, ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న రాష్ట్రం గుజ‌రాత్‌. గ‌తంలోదీనిని ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ పాలించారు.

ఈ రాష్ట్ర జ‌నాభా 6 కోట్ల పైచిలుకు. ఇక‌, జిల్లాలు మాత్రం 33. అయిన‌ప్ప‌టికీ పాల‌న భేషుగ్గా ఉంది. విద్యుత్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రాలో దేశంలోనే ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధి రేటు సాధించిన తొలి రాష్ట్రం. ఇంకా చాలా రంగాల్లో గుజరాత్ తిరుగులేని అభివృద్ధిని సాధించింది. ఇక‌, అత్యంత వెనుక‌బ‌డిన రాష్ట్రంగా పేరొందిన బిహార్ విష‌యానికి వ‌చ్చేస‌రికి గ‌తంలో లాలూ పాలించిన కాలంలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఈ స్టేట్‌.. ఇప్పుడు నితీష్ పాల‌న‌లో అభివృద్ధి బాట ప‌ట్టింది. ఈ రాష్ట్ర జ‌నాభా 10 కోట్ల మంది ఉన్నారు. 38 జిల్లాలు ఉన్నాయి. మ‌రి పాల‌న మాత్రం ఇటీవ‌ల గాడిన ప‌డ‌డంతోపాటు ప‌లు విష‌యాల్లో వృద్ధిని సైతం సాధిస్తోంది.

మ‌రి ఇలాంటి వాటితో పోల్చుకున్న‌ప్పుడు జిల్లాల సంఖ్య‌ను పెంచ‌డం తోనే పాల‌న పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని, ప్ర‌జ‌లు అభివృద్ధి సాధిస్తార‌ని ఎవ‌రైనా అనుకుంటారా?  తెలంగాణ విష‌యంలోనూ ఇప్పుడు అంద‌రూ ఇదే అనుకుంటున్నారు. జిల్లాల సంఖ్య పెంచ‌డంపై ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌ర‌మూ లేక‌పోయినా.. ప్ర‌భుత్వ పాల‌సీలే అంతిమంగా ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపిస్తాయి. కేసీఆర్ కోరుకుంటున్న బంగారు తెలంగాణ సాకారానికి కేవ‌లం జిల్లాల ఏర్పాటుతోనే ప‌నిజ‌రిగిపోదు. చిత్త‌శుద్ధి, పార‌ద‌ర్శ‌క‌త ఉంటేనే బంగారు తెలంగాణ సాకారం అవుతుంద‌నేది విశ్లేష‌కుల మాట‌!