ఏపీ విద్యాశాఖ‌లో సున్నాల‌కు అవినీతి క‌న్నం!

విద్యార్థులకు నీతులు నేర్పి.. ఉత్త‌మ పౌరులుగా తీర్చి దిద్దే ఏపీ విద్యాశాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారింది! అందిన ప్ర‌తి అవ‌కాశాన్ని అవినీతికి ఆల‌వాలంగా మార్చుకునేందుకు నేత‌ల మొద‌లు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు.  సర్వశిక్షా అభియాన్ మొదలుకుని ప్రతి దాంట్లోనూ అవినీతి దందానే. ట్యాబ్ లు కొనుగోలు మొదలుకుని ‘సున్నాలు’ వేసే వరకూ ప్రతి స్కీమ్ లోనూ అవినీతి ‘గంటలు’ మోగుతున్నాయి. మొన్నామ‌ధ్య టీచ‌ర్ల బ‌దిలీ వ్య‌వ‌హారంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌నే వార్త‌లు వ‌చ్చినా ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోలేదు. ఆ శాఖ మంత్రిగా గంటా శ్రీనివాస‌రావు నోటి వెంట ఏనాడూ ఈ అవినీతి గురించిన ప్ర‌స్తావ‌నే రాలేదు. మ‌రిదీనిలోని మ‌ర్మం ఆయ‌న‌కే తెలియాలి.

ఇక‌, ఇప్పుడు తాజాగా.. పాఠ‌శాల‌ల‌ను ఆధునికీక‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. ప్ర‌స్తుతం ద‌స‌రా సెల‌వులు ఉండ‌డంతో ఈ ప‌దిరోజుల గ్యాప్‌లో పాత‌ప‌డిన పాఠ‌శాల‌ల‌కు రంగులు, సున్నాలు వేయించి అధునాత‌న భ‌వ‌నాలుగా తీర్చిదిద్దాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని మొత్తం  3878 ఆదర్శ పాఠశాలను ఎంపిక చేసి వీటికి సున్నాలు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలో సున్నాల‌కు ప్రాజెక్టు త‌యారు చేయాల‌ని విద్యాశాఖ అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనిని భుజాన వేసుకున్న అధికారులు మంత్రి గంటా క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే అయిన‌దానికీ, కానిదానికీ లెక్క‌లు పెంచి మొత్తంగా సున్నాల లెక్క‌ల్లో క‌న్నాలు వేసేందుకు సిద్ధమ‌య్యారు.

ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌కు సున్నం వేసేందుకు మొత్తంగా.121.93 కోట్ల రూపాయలు అవుతాయని లెక్కలు వేశారు.  ఈ నివేదిక‌ను ఆమూలాగ్రం ప‌రిశీలించి దేనికి ఎంత అనేది నిర్ణ‌యించే అధికారం కేవ‌లం మంత్రికి మాత్ర‌మే ఉండ‌డంతో ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తున్న ప్రాజెక్టు అధికారులు సున్నం లెక్క‌ల్లో పెన్నును బ‌లంగా తిప్పారు. దీంతో వాస్తవ ధరలకు విద్యా శాఖ అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనల మధ్య భారీ వ్యత్యాసం ఉందని.. తెలుస్తోంది. కేవ‌లం ఇదంతా దోపీడీ స్కీమ్  లో భాగంగానే సాగుతోందని స‌మాచారం. ఉదాహరణకు ఏమైనా భారీ ప్రాజెక్టుల్లో అనుకోని ఖర్చులు ఉంటాయి. కానీ సున్నాలు వేసే కార్యక్రమంలోనూ అనూహ్య ఖర్చుల పేరుతో 2.33 కోట్ల రూపాయలను పొందుపర్చటంతో దోపిడీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి సున్నాల పేరుతో ఏపీ విద్యాశాఖ పెద్ద ఎత్తున అవినీతి క‌న్నం వేసేందుకు సిద్ధ‌మైపోయింద‌ని తెలుస్తోంది. మ‌రి దీనికి చంద్ర‌బాబు చెక్ పెడ‌తారో?  లేదో చూడాలి.