పవన్‌కి బీజేపీ రంగు తెలిసొస్తోంది.

పవన్‌కళ్యాణ్‌కి బిజెపి అసలు రంగు కనిపిస్తోంది. ఆ రంగుల్ని స్వయానా బీజేపీ నాయకులే చూపిస్తున్నారు. తిరుపతి బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ తమను విమర్శించినా, సరిపెట్టుకున్న బిజెపి నేతలు, ఈసారి కాకినాడలో చేసిన విమర్శల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మమ్మల్నే విమర్శిస్తావా? నీ రాజకీయ అనుభవం ఏంటి? అని వారు ప్రశ్నిస్తోంటే, పవన్‌కళ్యాణ్‌తోపాటు ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.

బిజెపి నాయకుడు ఆంజనేయరెడ్డి అయితే ఎప్పుడో పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి రాకముందు స్థాపించిన సిఎంపిఎఫ్‌ (కామన్‌ మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) ఏమయ్యింది? దాంతోనే ఆయన చిత్తశుద్ధి అర్థమయ్యింది అని విమర్శించడం శోచనీయం. అది తెలిసీ, పవన్‌కళ్యాణ్‌తో స్నేహాన్ని బిజెపి ఎందుకు కోరుకుందో ఆయన సమాధానం చెప్పవలసి ఉంది. పవన్‌కళ్యాణ్‌ ఏమీ గొంతెమ్మ కోర్కెలు కోరలేదు. తన సమక్షంలో నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నారు.

అప్పుడు అర్థమయ్యే బాషలో ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థం కాని భాషలో మాట్లాడుతుండడాన్నే ఆయన ప్రశ్నిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఇదే పెద్ద నేరం. తమ భజన చేస్తేనే మిత్రుడు, ప్రశ్నిస్తే శతృవే. ఏ రాజకీయ పార్టీ తీరు అయినా అలాగే ఉంటుంది. పవన్‌కి ఇప్పుడిప్పుడే ఆ రాజకీయ రంగు అర్థమవుతోంది.