టీడీపీ కంచుకోట‌లో అసంతృప్తి సెగ‌లు

ఏపీలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావ‌డానికి పూర్తిస్థాయిలో స‌హ‌కారం అందించిన జిల్లాల్లో ఒక‌టైన అనంత‌పురం గ‌త ఎన్‌టీఆర్‌ కాలం నుంచి ఈ పార్టీకి కంచుకోట‌గా ఉంది. ముఖ్యంగా ఎన్‌టీఆర్ స‌హా ఆయ‌న త‌న‌యుడు బాల‌య్య‌లు ఈ జిల్లా నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒక్క ఉర‌వ‌కొండ‌, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన 12 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లోనూ సైకిల్ దూసుకుపోయింది. అదేవిధంగా రెండు ఎంపీ సీట్ల‌నూ టీడీపీనే కైవ‌సం చేసుకుంది. దీంతో స్టేట్‌లో టీడీపీకి అత్య‌ధిక బ‌లం ఉన్న జిల్లాగా ఇది రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఇప్పుడు ఇదే జిల్లాలో అసంతృప్తి సెగ‌లు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా పార్టీ కోసం డే అండ్ నైట్ క‌ష్ట‌ప‌డ్డ కిందిస్థాయి కేడ‌ర్ ఓ రేంజ్‌లో ఫైరైపోతోంది. తాము ఎందుకు టీడీపీలో ఉన్నామా అనే రేంజ్‌లో బాధ‌ప‌డిపోతోంద‌ట‌.

 పార్టీ నాయ‌క‌త్వం త‌మ‌ను ఎంత‌మాత్ర‌మూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, క‌ర్రీలో క‌రేపాకులా తీసేస్తున్నార‌ని దిగువ శ్రేణి నేత‌లు పూర్తిగా ఆవేద‌న చెందుతున్నారు. వాస్త‌వానికి టీడీపీ ప‌దేళ్ల‌పాటు స్టేట్‌లో విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో కూడా టీడీపీ జెండాను మోసి.. కాంగ్రెస్ నేత‌ల నుంచి వేధింపులు ఎదుర్కొని పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు నానా తిప్ప‌లు ప‌డిన త‌మ‌ను ఇప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు వాపోతున్నారు.

త‌మ‌కు స్థానిక ఎమ్మెల్యేలే కాల్‌షీట్లు ఇవ్వ‌ని ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌ని అంటున్నారు. కనీసం నామినేటెడ్‌ పదవులు వారికి ఆఫర్ చేయకపోగా… చిన్నాచితకా కాంట్రాక్టు పనులు సైతం వారికి దక్కడం లేదని ఫీల‌వుతున్నారు. ముఖ్యంగా జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస‌రావు బీజేపీకి చెందిన నేత కావ‌డంతో కేవ‌లం ఆయ‌న ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు వ‌ర‌కే ప‌రిమితం అయ్యార‌నేది టాక్‌.

దీంతో టీడీపీ కింది స్థాయి కేడ‌ర్ ఒకింత విస్మ‌ర‌ణ‌కే గురైంది. అయితే, ఇటీవ‌ల ఈ జిల్లాను టీడీపీ యువ నేత‌, మంత్రి కొల్లు ర‌వీంద్ర‌కు అప్ప‌గించారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీ స్థానిక కేడ‌ర్‌లో ఉత్సాహం ఉర‌క‌లెత్తింది. త‌మకు ఇప్పుడైనా న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశ పెట్టుకుంది. అయితే, ఇటీవ‌ల ఓ స‌మీక్ష నిర్వ‌హించిన కొల్లు.. కేడ‌ర్ విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా కేవ‌లం ప‌థ‌కాల అమ‌లు విష‌యంపైనే దృష్టి పెట్టార‌ట‌.

ఇక‌, ఇప్పుడు కేడ‌ర్ మ‌రింత నిరుత్సాహంలో కూరుకుపోయింది. మ‌రి ఈ విష‌యంలో చంద్ర‌బాబు జోక్యం చేసుకుని కింది స్తాయి కేడ‌ర్‌లో ఉత్సాహం నింపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మొత్తానికి టీడీపీ కంచుకోట‌లో ముసురుకున్న అసంతృప్తిని ఆయ‌నే తొల‌గించాల‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.