జ‌గ‌న్‌కు ల‌క్ష మెజార్టీ అంటోన్న టీడీపీ నేత‌లు

2019 ఎన్నిక‌ల్లో విప‌క్ష వైకాపా అధినేత జ‌గ‌న్‌కు ఆయ‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో చుక్క‌లు చూపించాల‌ని ప‌క్కా ప్లాన్‌తో ఉన్న టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆశ‌లు నెర‌వేరేట‌ట్టు లేవా? ఆయ‌న ల‌క్ష్యానికి సొంత పార్టీ త‌మ్ముళ్లే తూట్లు పొడుస్తున్నారా? ఒక‌రిలో ఒక‌రు కుమ్ములాట‌ల‌తో పొద్దు పుచ్చుతున్నారా? క‌డ‌ప‌లో టీడీపీని బ‌ల‌హీనం చేస్తున్నారా? అటు తిరిగి ఇటు తిరిగి జ‌గ‌న్‌కే ల‌బ్ధి చేకూరేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారా? అంటే.. ప్ర‌స్తుతం క‌డ‌ప‌లో ఉన్న పొలిటిక‌ల్ సీన్‌ను చూస్తే.. ఔన‌నే చెప్పాల్సి వ‌స్తోంది. గ‌డిచిన కొన్నాళ్లుగా ఈ జిల్లాలో తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న విభేదాలు.. ఇప్పుడు ర‌చ్చ‌కెక్కాయ‌నే టాక్ వ‌స్తోంది. అదేంటో మ‌న‌మూ చూద్దాం.

వైకాపా అధినేత జ‌గ‌న్‌కు క‌డ‌ప జిల్లా పెట్ట‌నికోట‌. కొన్ని ద‌శాబ్దాలుగా ఈ జిల్లా ప్ర‌జ‌లు వైఎస్ కుటుంబానికే విధేయులుగా ఉండ‌డంతోపాటు ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా.. రాష్ట్రంలో ఎవ‌రి మేనియా ఉన్నా.. వైఎస్ కుటుంబానికే ఓట్లు గుద్దేస్తున్నారు. 2014లో అటు మోడీ, ఇటు ప‌వ‌న్ మేనియా రాష్ట్రాన్ని కుదిపేసిన టైంలో కూడా వైకాపాకే క‌డ‌ప ప్ర‌జ‌లు అత్య‌ధిక ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీంతో క‌డ‌ప‌లోని 10 ఎమ్మెల్యే స్థానాల్లో 9 వైకాపా గెలుచుకోగా.. ఒక్క చోట మాత్ర‌మే టీడీపీ పాగా వేసింది. ఇక‌, రెండు ఎంపీ సీట్ల‌ను జ‌గ‌నే కైవ‌సం చేసుకున్నారు. దీంతో జ‌గ‌న్‌ను పొలిటిక‌ల్‌గా వీక్ చేయాలంటే.. ఆయ‌న‌ను త‌న సొంత జిల్లాలోనే టార్గెట్ చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మొన్నామ‌ధ్య ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్రారంభించిన‌ప్పుడు కూడా క‌డ‌ప వైకాపా ఎమ్మెల్యేల‌కు రెడ్ కార్పెట్ ప‌రిచారు.

ఇక‌, ఆత‌ర్వాత 2019 ఎన్నిక‌లపై దృష్టి పెట్టిన చంద్ర‌బాబు.. క‌డ‌ప‌లో ఏకంగా జ‌గ‌న్‌నే ఓడించేలా ముందుకు వెళ్లాల‌ని త‌మ్ముళ్ల‌కు దిశానిర్దేశం చేశారు. వారు అడిగినంత నిధులు ఇచ్చేందుకు, టీడీపీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను అద్దంలా తీర్చి దిద్దేందుకు ఆయ‌న ప‌చ్చ‌జెండా ఊపారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఓట‌ర్లు సైకిల్ ని ఆద‌రిస్తార‌ని ఆయ‌న భావించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. క‌డ‌ప‌లో టీడీపీ త‌మ్ముళ్ల మ‌ధ్య అస్స‌లు స‌ఖ్య‌త లేక‌పోవ‌డ‌మే ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. క‌డ‌ప‌లో టీడీపీని శాస‌న మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్‌, పులివెందుల టీడీపీ నేత స‌తీష్ రెడ్డే వీక్ చేస్తున్నార‌ని స్థానిక తెలుగు త‌మ్ముళ్లు ఆరోపిస్తున్నారు. స‌తీష్ రెడ్డి గ్రూపుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని, ఆయ‌న గెలుపు కోసం 2014లో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డ కిందిస్థాయి కేడ‌ర్‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జిల్లా స్థాయి నేత‌లు పాపిరెడ్డి, భాస్క‌ర‌రెడ్డి, కృష్ణారెద్ది త‌దిత‌రులు అంటున్నారు. స‌తీష్ వ్య‌వ‌హార శైలితో సైకిల్‌కి పంచ‌ర్లు ఖాయ‌మ‌ని ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లు స‌తీష్ రెడ్డి పొలిటిక‌ల్‌గా చాలా వీక్ అని.. ఆయ‌న పోటీ చేసిన‌ప్పుడు టీడీపీకి చాలా త‌క్కువ ఓట్లు ప‌డ్డాయ‌ని, అదే కందున రాజ‌మోహ‌న్‌రెడ్డి పోటీ చేసిన‌ప్పుడే ప‌రిస్థితి బాగుంద‌ని అంటున్నారు. 2019లో క‌నుక స‌తీష్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తే.. వైకాపా అధినేత జ‌గ‌న్ ఖ‌చ్చితంగా ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని త‌మ్ముళ్లు లెక్క‌లు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు క‌డ‌పలో టీడీపీ నేత‌ల మ‌ధ్య ఉప్పునిప్పులాంటి వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  మ‌రి 2019 నాటికి కూడా ప‌రిస్థితి ఇలానేఉంటే.. చంద్ర‌బాబు ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేరుతాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.