చంద్ర‌బాబు చేతిలో కేంద్రం లాలీప‌ప్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై త‌న స్టైల్లో ఫైర‌య్యారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్. ఏపీకి ప్ర‌త్యేక హోదాను తీసుకురాలేక‌పోయార‌ని ఎద్దేవా చేసిన ఆయ‌న కేంద్రం చంద్ర‌బాబును బాబు(చిన్న‌పిల్లాడి) మాదిరిగానే ట్రీట్ చేస్తోంద‌ని విమ‌ర్శించారు. అందుకే చంద్ర‌బాబు మాట‌ను కేంద్రం లెక్క‌లోకి తీసుకోవ‌డం లేద‌న్నారు. హోదా అడిగితే ప్యాకేజీ ఇచ్చింద‌న్నారు. ఇక‌, మ‌రో అడుగు ముందుకేసిన దిగ్విజ‌య్‌.. పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టును ఏపీకి అప్ప‌గించ‌డంపైనా కామెంట్లు కుమ్మేశారు. పోల‌వ‌రాన్ని ఓ లాలీప‌ప్‌తో పోల్చారు.

ఈ లాలీప‌ప్‌ను కేంద్రం చంద్ర‌బాబుకు ఇచ్చింద‌ని స‌టైరిక‌ల్‌గా కామెంట్ చేశారు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో ఏపీ పాలిటిక్స్‌పై ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబును ఏకేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్ర‌మే నిర్మించాల్సి ఉన్నా.. చంద్ర‌బాబుకే అప్ప‌గించ‌డం వెనుక పెద్ద ర‌హ‌స్యం ఉంద‌న్న ఆయ‌న.. చంద్ర‌బాబు డ‌బ్బులు సంపాదించుకోడానికే కేంద్రం ఈ ప్రాజెక్టును ఆయ‌న‌కు అప్ప‌గించింద‌న్నారు. ఇదొక లాలీప‌ప్ వంటిది. చంద్ర‌బాబు అడ్డ‌దారిలో సంపాయించుకోడానికి ఇదొక మార్గం అని విమ‌ర్శించారు.

పోల‌వ‌రాన్ని ఏపీ చేప‌డితే, తెలంగాణ ఏపీల మ‌ధ్య గొడ‌వ‌లు ఖాయ‌మ‌ని చెప్పారు. ఈ విష‌యం కేంద్రానికి తెలుసున‌ని అయినా త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకునేందుకు, చంద్ర‌బాబుకు సాయం చేసేందుకు దీనిని ఏపీకి అప్ప‌గించింద‌ని ఆయ‌న అన్నారు. పోల‌వ‌రాన్ని కేంద్రం చేప‌ట్టి పూర్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. కాగా, పోల‌వ‌రం మాటేమిటో తెలీదుకానీ… దిగ్విజ‌య్ చేసిన లాలీప‌ప్ వ్యాఖ్య‌ల‌పై మాత్రం సోష‌ల్ మీడియాలో కామెంట్లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.