ఓటుకు నోటు కేసులో ఏం తేల‌నుంది..?

వైసీపీ నేత, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి వేసిన పిల్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల‌తో ఓటుకు నోటు కేసుపై రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది. సుప్రీం ఆదేశాలు త‌మ‌కే అనుకూల‌మ‌ని టీడీపీ, వైసీపీ నేత‌లు ఎవ‌రికి వారు అన్వ‌యించుకుని వ్యాఖ్యానిస్తుండ‌గా మీడియాలోనూ దీనిపై భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు… ఏసీబీ కోర్టు విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని ఆదేశిస్తూ 8 వారాల‌పాటు స్టే ఇవ్వ‌గా దీనిపై రామ‌కృష్ణారెడ్డి సుప్రీంను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.
ఈ కేసుపై శుక్ర‌వారం సుప్రీం కోర్టు స్పందిస్తూ 4 వారాల్లోగానే నిర్ణయం తీసుకోవాలని హై కోర్టును ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోగా హైకోర్టు ఏ నిర్ణయం వెలువరించని పక్షంలో పిటిషనర్ మరోసారి సుప్రీంకోర్టుకు రావచ్చని కూడా తెలిపింది. ఈ కేసులో సీనియర్ న్యాయవాది నాప్రే రామ‌కృష్ణారెడ్డి త‌ర‌పున వాదనలు వినిపించారు.

ఇది ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారమని, కేసును జాప్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి దశలో స్టే విధించడం సరికాదని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు.. తాము సమర్పించిన ఆధారాలతో ఏసీబీ కోర్టు సంతృప్తి చెందడం వల్లే ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణకు ఆదేశించిందని, దానిపై స్టేను తొలగించేలా చూడాలని కోరారు. అయితే.. కేసు విచారణపై హైకోర్టు 8 వారాల పాటుస్టే ఇచ్చిన నేపథ్యంలో కేసులో జోక్యం చేసుకోలేమని.. అయితే నాలుగు వారాల్లోగా కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపింది.

దీనిపై జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌ని ప‌లు వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది… ఇది చంద్ర‌బాబుకు ఎదురుదెబ్బ అని వైసీపీ వ‌ర్గాలు చెపుతుండ‌గా.., ఈ కేసులో చంద్ర‌బాబుపై ఏదో ఒక దుష్ప్ర‌చారం చేయాల‌న్న దురాలోచ‌న‌తోనే వైసీపీ ఈ కేసును మళ్లీ తెర‌పైకి తెచ్చింద‌ని దీంతో వైసీపీ సాధించేమీ ఉండ‌ద‌ని టీడీపీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంమీద వైసీపీ ఈ కేసుతో మ‌రోసారి టీడీపీని ఇర‌కాటంలో పెట్టింద‌న్న‌ది మాత్రం వాస్త‌వం.