ఆ టీడీపీ ఎమ్మెల్యేకు క‌ప్పం క‌ట్టాలట

ఏపీ సీఎం చంద్ర‌బాబు చెబుతున్న దానికీ.. టీడీపీ త‌మ్ముళ్లు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న దానికీ సంబంధం లేకుండా పోతోంది! తాను నిప్ప‌నంటూ చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్పుకొంటారు. త‌న‌పై ఎన్నో కేసులు న‌మోదైనా అన్నింటి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని అంటారు. తెలుగు డిక్ష‌న‌రీలో త‌నకు న‌చ్చ‌ని ప‌దం అవినీతేనేన‌ని అంటారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, తెలుగుదేశం జెండాపై బాబు క‌నుస‌న్న‌ల్లో నెగ్గిన ఎమ్మెల్యేలు కొందరు విచ్చ‌ల‌విడిగా దోపిడీకి తెర‌లెత్తేయ‌డం మాత్రం ఆయ‌న‌కు సంబంధంలేదా? ఆయ‌నెలాంటి చ‌ర్య‌లూ తీసుకోరా? ఇప్పుడు ఇదే విష‌యంపై ఏపీలో తీవ్ర చ‌ర్చ‌సాగుతోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్ప‌టికే న‌లుగురైదుగురు టీడీపీ ఎమ్మెల్యేల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరి ఆగ‌డాలు మితిమీరాయ‌ని, ప్ర‌తి ప‌నికీ రేటుపెట్టి మ‌రీ వ‌సూళ్లు చేస్తున్నార‌ని.. సాండ్ స్కాం స‌హా అనేక కుంభ‌కోణాల్లో వీరి పాత్ర ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయినా చంద్ర‌బాబు త‌న‌దైన స్టైల్‌లో వారిని మంద‌లించాన‌ని చెప్ప‌డ‌మే కానీ.. ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌నేది వాస్త‌వం.

ఇక‌, ఇప్పుడు  తాజాగా సీఎం సొంత జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే  కురుగొడ్ల రామకృష్ణ మీద ఓ కాంట్రాక్టు సంస్థ అవినీతి ఆరోప‌ణ‌లు చేసింది. చేయ‌డ‌మే కాదు ప‌క్కా ఆధారాల‌ను కూడా మీడియా ముందు పెట్టింది. రైల్వే పనులు చేయాలంటే తనకు కప్పం కట్టాలంటూ స‌ద‌రు సంస్థ‌ను బెదిరించ‌డ‌మే కాకుండా ప‌నులు ఎలా మొద‌లు పెడ‌తార‌ని హుకుం జారీ చేసిన‌ట్టు సంస్థ ప్ర‌తినిధి చెబుతున్నారు. దీనికి సంబంధించి ఫోన్ సంభాష‌ణ‌ల‌ను ఆయ‌న వినిపించారు. రాపూరు – కృష్ణపట్నం రైల్వే పనుల్ని మాంటో కార్లో కంపెనీ దక్కించుకుంది.

అయితే, ఈ ప‌నులు స‌జావుగా సాగాలంటే త‌న మార్జిన్ త‌న‌కు ఇవ్వాల‌ని ఎమ్మెల్యే రామ‌కృష్ణ నేరుగా బేరానికి దిగిపోయారు.  కంపెనీ సెక్రటరీ కల్పేశ్ దేశాయ్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. త‌న వాటా త‌న‌కు ఇవ్వ‌క‌పోతే.. ప‌నులు ఎలా చేస్తారో చూస్తాన‌ని రామ‌కృష్ణ సద‌రు సంస్థ‌ను బెదిరించారు. దీంతో రైల్వే ప‌నులు సాగ‌డం లేదు. ఎమ్మెల్యే తీరుపై రాష్ట్ర సర్కారుకు.. ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినా ఎలాంటి ఫలితం రాలేద‌ని రామ‌కృష్ణ నుంచి త‌మ‌ను ర‌క్షించేవారు లేరా అని క‌ల్పేశ్ వాపోయారు. దీంతో ఇప్పుడు ఈ ఆరోప‌ణ‌లు మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారమ‌వుతున్నాయి. మ‌రి ఈ ఆరోప‌ణ‌ల‌పై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.