అనుష్క మరో అరుంధతినా?

అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘అరుంధతి’ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. అనుష్క సినీ ప్రయాణాన్ని ‘అరుంధతి’కి ముందు, అరుంధతికి తర్వాత అని లెక్కించవచ్చు. అంతగా ఆ సినిమా తర్వాత అనుష్క కెరీర్‌ టర్న్‌ అయిపోయింది. అంతవరకూ కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం అనుకున్న అనుష్కను ఆ తరువాతి నుంచీ ఆమె స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది.

అంత గొప్ప సినిమా తరువాతనే ఆమె నుండి ‘బాహుబలి’, రుద్రమదేవి’, సైజ్‌ జీరో వంటి ఎన్నో విలక్షణమైన సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ కూడా అనుష్క చుట్టూనే తిరిగే స్టోరీ. ఇది కాక ‘భాగ్‌మతి’ అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కూడా రానుంది. ఇది కూడా ‘అరుంధతి’ స్థాయి సినిమానే అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇదొక థ్రిల్లర్‌ మూవీ. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘పిల్ల జమీందార్‌’ డైరెక్టర్‌ అశోక్‌ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.

ఈ సినిమా కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి భారీ సెట్స్‌ ప్రిపేర్‌ చేస్తున్నారట. ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్న పాత్రల్లో నటించనుందని సమాచారం. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమా నిర్మాణం పూర్తవగానే ఈ సినిమా కోసం అనుష్క కసరత్తులు ప్రారంభించనుందట. అంతేకాదు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వస్తోన్న ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది అనుష్క.