మోడీ కి తెరాస సత్తా చూపే టైమొచ్చింది

తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు అంశాల వారిగా మద్దతు ఉంటుందని ప్రకటనలు చేసిన గులాబి నేతలు… ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ జనసమీకరణలో తమకు సాటి లేదని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7న మొదటిసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మోదీ పాల్గోనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోనే ప్రధాని పర్యటన ఉండటంతో అధికార పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. మోదీ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమమే అయినా మొదటి సారి తెలంగాణకు రానున్న నేపథ్యంలో ప్రధానికి తమ సత్తాను చూపించేందుకు గులాబి బాస్ దృష్టి సారించారు.మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలతో పాటు అధికార యంత్రాగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం అదనంగా నిధులు కేటాయించలేదని విమర్శలు చేసిన అధికార పార్టీ నేతలు ప్రధాని పర్యటనతో భారీగా నిధులు పొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

మంత్రి హరీష్ రావుతో పాటు మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు… టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ జనసమీకరణపై దృష్టి పెట్టారు. మోదీ సభకు రెండు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి ప్రజలను తరలించాలని అధికార పార్టీ నిర్ణయించింది. భారీ జనసమీకరణ ద్వారా బీజేపీ  అ్రగనాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు గులాబి పార్టీ పావులుకదుపుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కాక తప్పదని అధికార పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. మరో వైపు ప్రధాని పర్యటనతో తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల వైఖరిలో మార్పువచ్చి కొత్త స్నేహం చిగురించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.