భూమిక ఎన్నాళ్ళకెన్నాళ్ళకు?

అందాల తార భూమిక చాలా కాలం తర్వాత ఓ సినిమాలో నటించనుంది. అయితే అతిథి పాత్రలోనే ఆమె నటిస్తోంది. బాలీవుడ్‌ సినిమా ‘ఎమ్మెస్‌ ధోనీ’ చిత్రంలో నటిస్తున్న భూమిక, ఈ సినిమా ట్రైలర్‌లో మెరిసింది. అది చూసి భూమిక అభిమానులు మురిసిపోయారు. తెలుగులో ‘స్నేహమంటే ఇదేరా’, ‘వాసు’, ‘ఖుషీ’, ‘అనసూయ’, ‘ఒక్కడు’ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన భూమిక, బాలీవుడ్‌లో కూడా నటిగా రాణించింది.

కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన భూమిక, కొంతకాలం నటనకు గ్యాప్‌ ఇచ్చినా, తిరిగి సినిమాల్లో నటించాలనుకుని బాలీవుడ్‌ సినిమాల్లో ట్రై చేసినట్టుంది. భూమిక చేస్తానంటే తెలుగులోనూ ఆమెకు అవకాశాలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అయితే భూమిక విలక్షణ పాత్రల వైపే మొగ్గుచూపుతోంది. పెళ్లికి ముందు వరకూ హుందాతనంతో కూడిన పాత్రలే కాకుండా కొంచెం గ్లామరస్‌ పాత్రలు కూడా చేసింది భూమిక.

కానీ పెళ్ళి తర్వాత, భూమిక ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అంతకు ముందు కూడా భూమిక ఎప్పుడూ గ్లామరస్‌ పాత్రలకే పరిమితం కాలేదు. కాబట్టి ఆమెకు ఏ రకమైన పాత్ర అయినా చక్కగా సూటయిపోతుంది. అందుకే భూమిక ఎప్పటికీ వెరీ వెరీ స్పెషల్‌. ‘ఎమ్మెస్‌ ధోనీ’ సినిమా విషయానికి వస్తే ఇందులో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుట్‌ టైటిల్‌ రోల్‌లో కనిపిస్తాడు. ధోనీ సోదరి పాత్రలో భూమిక నటిస్తోంది