జగన్‌ కొత్త గెటప్‌ వెనుక రాజకీయ కోణం

అధికారంలో ఉన్నవారెవరైనాసరే కులమతాలకతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని మతాల పండుగల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఆయా మతాచారాల ప్రకారం వ్యవహరిస్తారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నవారికి అవన్నీ చేయాలని రూలు ఏమీ లేదు. ఆయా మతాల పండుగల్లో పాల్గొనడం వేరు, ఆ మతాచారాల్ని పాటించడం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, క్రిస్టియానిటీని విశ్వసిస్తారు. అలాగని ఆయన ఇతరమతాలకి వ్యతిరేకి కాదు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లి, ‘విశ్వాసం’ తెలపలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయనే ఇప్పుడు రిషికేష్‌లో యజ్ఞ యాగాదుల్లో పాల్గొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రావాలని జగన్‌ యజ్ఞ యాగాదులు నిర్వహించారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ చెబుతోంది. ఢిల్లీలో జాతీయ పార్టీలను ఒప్పించి, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్‌ అట్నుంచి అటే రిషికేష్‌కి వెళ్ళి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరుగుతున్న చాతుర్మాస దీక్ష హోమంలో పాలుపంచుకున్నారు. స్వరూపానందేంద్ర అంటే, చంద్రబాబు వ్యతిరేకి. కాబట్టే ఆయన సూచనల మేరకు జగన్‌, ఈ దీక్షలు హోమాలు చేస్తున్నారని, ఇవన్నీ రాజకీయంగా బలపడేందుకు మాత్రమేనని అధికార పక్షం నుంచి విమర్శలు వినవస్తున్నాయి.