కేసీఆర్ గజ్వేల్ కే ముఖ్యమంత్రా…

తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందనడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్క గజ్వేల్ సీఎం కాదని, ఇతర ప్రాంతాలపైనా శ్రద్ధ వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించే పథకాలన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవే అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన కరీంనగర్ లో మాట్లాడుతూ సుజల స్రవంతి పేరు మార్చి మిషన్ భగీరథ అని పేరు పెట్టారని వ్యాఖ్యానించారు. పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరామని పొన్నం తెలిపారు.