అప్పుడు అన్నతో ఇప్పుడు తమ్ముడితో

‘బొమ్మరిల్లు’ సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకుని ఆ సినిమా పేరునే తన ఇంటి పేరు చేసుకున్న డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌. ఆ తర్వాత ‘పరుగు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ఈ సినిమా మొదట్లో నెగిటివ్‌ టాక్‌ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత పోజిటివ్‌ టాక్‌తో బయట పడింది.

కానీ ఈ డైరెక్టర్‌కి ఆ తర్వాత పెద్దగా సక్సెస్‌లు లేవు. చరణ్‌తో తెరకెక్కించిన ‘ఆరెంజ్‌’ ఫెయిల్యూర్‌ని చవి చూసింది. రామ్‌తో ‘ఒంగోలు గిత్త’ సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. దాంతో ఈ డైరెక్టర్‌ తెరపైకి రాలేదు ఆ తర్వాత. మళ్లీ ఇప్పుడే ఒక కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌ హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా అల్లు అరవింద్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం అల్లు అరవింద్‌ ప్రొడక్షన్‌లో శిరీష్‌ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా విడుదలకు రెఢీగా ఉంది. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌ – అల్లు శిరీష్‌ కాంబినేషన్‌ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌తో సింపుల్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడట భాస్కర్‌. తక్కువ బడ్జెట్‌ అయినా, విజువల్‌గా చాలా రిచ్‌ లుక్‌లో చూపించాలనుకుంటున్నాడట. అప్పుడు అన్న అల్లు ఆర్జున్‌తో విజయం అందుకున్న భాస్కర్‌, ఇప్పుడు తమ్ముడు శీరీష్‌తో బొమ్మరిల్లు’ వంటి సక్సెస్‌ని తిరిగి పొందుతాడేమో చూద్దాం.