వెంకీ స్పీడు పెంచేశాడు

వెంకీ ప్రస్తుతం ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ లోపలే మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు. టాలీవుడ్‌లో రీమేక్స్‌ కింగ్‌గా పేరున్న వెంకీ ఇప్పుడు మరో రీమేక్‌కి పచ్చజెండా ఊపాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసే యోచనలో ఉన్నాడు వెంకీ.

సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించబోతోంది. బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్‌ కోచ్‌గా తమిళంలో మాధవన్‌ నటన ఆకట్టుకునేలా ఉంటుంది. మాధవన్‌ దగ్గర బాక్సింగ్‌ నేర్చుకునే అమ్మాయి పాత్రలో రితికా సింగ్‌ నటించింది. ఇప్పుడు మాధవన్‌ పాత్రను వెంకటేష్‌ పోషిస్తుండగా, తెలుగులో కూడా రితికా సింగ్‌నే బాక్సింగ్‌ నేర్చుకునే అమ్మాయిగా ఎంచుకోవడం జరిగింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథలో చాలా మార్పులే చేయనున్నారట.

వెంకీ బాడీ లాంగ్వేజ్‌కి సెట్‌ అయ్యే విధంగా వినోదంతో కూడిన యాక్షన్‌ సన్నివేశాల్ని ఈ సినిమాలో మిళితం చేయనున్నారట. ప్రస్తుతం వెంకీ జోరు మీదే ఉన్నాడు. ‘దృశ్యం’, గోపాల గోపాల’ చిత్రాల వరుస విజయాలతో వెంకీ టైమ్‌ సూపర్బ్‌గా ఉంది. అందుకే మారుతిలాంటి చిన్న దర్శకుడితో వెంకీ సినిమాకు కమిట్‌ అయ్యాడు. అదే జోరుతో ఆపకుండా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట. ‘బాబు బంగారం’ రిలీజ్‌ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.