కెసిఆర్ మంత్రివర్గంలోకి డికె అరుణ!

అధికార టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయడంలో విజయం సాదించిన గులాబీ దళం ఇపుడు తన దృష్టిని పాలమూర్ జిల్లా వైపు మళ్లించింది. పార్టీ యువ నేతలు కెటిఆర్, హరీశ్‌రావులు పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. నల్గొండ ఆపరేషన్‌కు మంత్రి హరీశ్‌రావు సారథ్యం వహిస్తే పాలమూర్ ఆపరేషన్‌కు యువనేత సిఎం తనయుడు కెటిఆర్ సారథ్యం వహిస్తున్నారు. నేరుగా రంగంలోకి దిగిన కెటిఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ తో సమావేశ మయ్యారు. ఆమెను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వనించారని సమాచారం. ఆమెతో పాటు మరో ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కూడ ఈ బేటిలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని రెండు వర్గాలు అంటున్నాయి. అయితే డికె అరుణ సోదరుడు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని తనకు తెలియకుండా టిఆర్ఎస్‌లోకి తీసుకోవడం పై అరుణ ఒకింత అసహనం వ్యక్తం చేసినప్పటికి చివరికి తాను కూడ గులాబీ కండువా కప్పుకోవడానికి అంగీకరించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక పార్టీలో, ప్రభుత్వంలో తన రోల్ ఉండాలే అనే అంశం పైన సుదీర్ఘంగానే చర్చ లు జరిగాయని తెలుస్తోంది. టిఆర్ఎస్ నేతలు చెబుతున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం పాలమూరు జిల్లా నుండి మంత్రి వర్గంలో కొనసాగుతున్న ఇద్దరు నేతలు కూడ రాజకీయంగా మహబూబ్‌నగర్ జిల్లాలో టిఆర్ఎస్ ను బలోపేతం చేయడంలో విఫలమయ్యారని కెసిఆర్ సన్నిహిత వర్గాలు అంచనావేస్తున్నాయి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, కె లక్ష్మారెడ్డిలకు పార్టీ విస్తరణలో పూర్తి స్వేచ్చ ఇచ్చినప్పటికి దానిని వారు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేద న్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడి నుండి నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్‌రెడ్డిలను రాజకీయంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నం కావడంతో టిఆర్ఎస్ అధిష్ఠానం డికె అరుణను పార్టీ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ గాలి వీచినప్పటికి మొన్నటికి మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆమె ఒంటిచేత్తో ఓ సీటులో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోగలిగారు. రాష్ట్ర అసెంబ్లీలోను కాంగ్రెస్ గొంతును ఆమె బలంగా వినిపిస్తున్నారు. ఈ పరిణామాలతో అటు కాంగ్రెస్ పార్టీని కూడ ఆత్మరక్షణలోకి నెట్టవచ్చన్న వ్యూహంతో టిఆర్ఎస్ పెద్దలు అడుగులు వేస్తున్నారు.

ప్రస్తుత పాలమూరు జిల్లా రాజకీయాలలో డికె అరుణ హవా కొనసాగుతుంది. అక్కడక్కడ అధికార టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నేతలకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆమె దగ్గరుండి కాంగ్రెస్ నేతలకు అండగా ఉంటూ వచ్చారు. డికెనే పార్టీ మారేందుకు సిద్దమైందన్న ప్రచారంతో జిల్లాలోని కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున టిఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని సమాచారం. వీరిలో అరుణ ప్రధాన అనుచరులుగా ఉన్న ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, గత ఎమ్మెల్సీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దామోదర్‌రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. మంత్రి కెటిఆర్‌తో జరిగిన చర్చలలో వీరు పాల్గొన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన సంపత్‌కుమార్ అనర్గళంగా మాట్లాడడంలో దిట్ట. అనతి కాలంలోనే పాలమూర్ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయన్న అంచనాలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా దామోదర్‌రెడ్డికి గుర్తింపు ఉంది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఆయనకు గట్టి పట్టు ఉంది. వీరితో పాటు గద్వాల్, దేవరకద్ర తదితర నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడ పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు ప్రచారం జరగుతుంది.

త్వరలోనే సిఎం కెసిఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో డికె అరుణకు క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్‌నగర్ మూడు జిల్లాలుగా ఉండబోతుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయిని నర్శింహరెడ్డి లేదా డాక్టర్ లక్ష్మారెడ్డిలలో ఒకరికి ఉద్వాసన పలికి వారి స్థానంలో అరుణకు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు క్యాబినెట్‌లో మహిళలు లేరన్న విపక్షాల ఆరోపణలకు పుల్‌స్టాప్ పెట్టినట్టవుతుందని సిఎం కెసిఆర్ ఆలోచన. దీనికి సంబందించి ఇప్పటికే కెటిఆర్ నుండి డికె అరుణకు స్పష్టమైన హమీ లభించింది. త్వరలోనే ముఖ్యమంత్రితో అరుణతో పాటు మిగిలిన నేతలు కూడ సమావేశమై పార్టీలో చేరికకు సంబందించి తుది దశ చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని సమీకరణలు కుదిరితే జులై నెలలోనే ఆపరేషన్ పాలమూరు పూర్తి చేసేందుకు రంగం సిద్దమవుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి