స్విస్‌ ఛాలెంజ్‌: కేంద్రానికి ఇష్టంలేదా? 

అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్‌ ఛాలెంజ్‌పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్‌. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం టిడిపి మిత్రపక్షమైన బిజెపి నుంచి కూడా వస్తోంది.

నిజానికి అమరావతి నిర్మాణానికి పూర్తిగా కేంద్రమే సహాయం అందించవలసి ఉంది. అయితే చంద్రబాబు ఆలోచనలు ఇంకోలా ఉన్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం ఆయన పట్టుదలతో ఉన్నారు. ఆ స్థాయి రాజధానికి నిధులు ఇచ్చేంత విశాల హృదయం కేంద్రానికి లేదు. ఇద్దామనుకున్నాసరే ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌కి అంత ఎక్కువ నిధులు ఇవ్వడానికి ఒప్పుకోవు. ఈ పరిస్థితులలో చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌ వైపు మొగ్గు చూపారు. ప్రైవేటు రాజధాని అవుతుందనే విమర్శలు వినవస్తున్నా వాటిని పెడచెవిన పెట్టి చంద్రబాబు ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. ఇలా చంద్రబాబు వ్యవహరిస్తున్న మొండి వైఖరి పట్ల కేంద్రం కూడా అసహనంతో ఉందని సమాచారమ్‌.