‘సుల్తాన్‌’ నోటికి తాళం పడింది 

‘సుల్తాన్‌’ సల్మాన్‌ఖాన్‌ నోటికి తాళం పడింది. రేప్‌ వివాదంలో ఇరుక్కున్న ఈ కండల వీరుడు ఆ వివాదం తీవ్రతతో జాగ్రత్తపడ్డాడు. ఇకపై ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఎక్కువసేపు ఉన్నా, తక్కువే మాట్లాడతానని చెప్పాడు కూడా. వివాదంపై మాత్రం స్పందించలేదు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుని, ఇంకా తప్పుగా ప్రచారం చేశారని మాత్రమే సమాధానమిచ్చాడు సల్మాన్‌ఖాన్‌. అయితే అతని తండ్రి, తన కుమారుడు చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకున్నాడు. అదే సంస్కారం సల్మాన్‌ఖాన్‌ కూడా ప్రదర్శించి ఉంటే బాగుండేది. అది అతని స్థాయిని పెంచుతుంది. కానీ, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పడం ద్వారా చేసిన వ్యాఖ్యల్ని ఆయన సమర్థించుకున్నట్లే అయ్యింది.

సినిమా షూటింగ్‌ గురించి చెప్పమంటే షూటింగ్‌ అయ్యాక తన పరిస్థితి రేప్‌కి గురైన మహిళలా ఉందని చెప్పడం వివాదానికి కారణమని తెలుసు కదా. బాలీవుడ్‌లో ఎందరో ప్రముఖులు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యల్ని ఖండించారు. అతని సన్నిహితులు కూడా ఖండించినా, వ్యాఖ్యల వివాదంపై సల్మాన్‌ఖాన్‌ స్పందించి, క్షమాపణ చెప్పకపోవడం శోచనీయం. మాట్లాడటం తగ్గించుకుంటాడో, పెంచుకుంటాడో అది అతని ఇష్టం. తక్కువ మాటలు మాట్లాడినా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు, బాధ్యతారాహిత్యంతో మాట్లాడకూడదు. యాభయ్యేళ్ళ యంగ్‌ స్టర్‌ సల్మాన్‌ఖాన్‌ నుంచి ఇలాంటి తీరుని ఎవరూ ఆశించరు.