శ్రీమంతుడు కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు

శ్రీమంతుడు సినిమా తర్వాత మహేశ్ బాబు గ్రామాలను దత్తత తీసుకు న్నారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న చాలాకాలం తర్వాత.. ప్రిన్స్ తరపున ఆయన సతీమణి హెల్త్ క్యాంపు నిర్వహించారు. త్వరలో మహేశ్‌బాబు గ్రామంలో పర్యటిస్తారని నమ్రత ప్రకటించడంతో గ్రామస్థులు ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు.శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు తన స్వగ్రామానికి వెళ్లి అభివృద్ధి చేస్తాడు. గ్రామస్థులందరిలో స్ఫూర్తి నింపి ఆదర్శంగా నిలుస్తాడు.

కేవలం సినిమాలోనే కాకుండా నిజజీవితంలోనూ వెనుకబడ్డ గ్రామాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు ఈ ఆరడుగుల అందగాడు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ లోని తన స్వగ్రామం బుర్రిపాలెంతో పాటు… తెలంగాణలో పాలమూరు జిల్లాలోని కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ను ఎంపిక చేసుకున్నారు.నిత్యం సినిమా షూటింగ్ లో బిజీగా ఉండే మహేశ్ కు గ్రామాన్ని సందర్శించడానికి వీలు కాలేదు. ఇటీవలే పదిరోజుల క్రితం మహేశ్ బాబు సతీమణి నమ్రతాశిరోద్కర్ సిద్ధాపూర్ గ్రామానికి చేరుకొని అక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించారు.గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించిన నమ్రత త్వరలో మహేశ్ బాబు పర్యటిస్తారని తెలిపారు. దీంతో గ్రామస్థుల్లో సంతోషం నెలకొంది.

మహేష్‌బాబు దత్తత తీసుకున్న గ్రామం హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తూరు మండలం సిద్దాపూర్‌ గ్రామపంచాయతీని ఆయన ఎంచుకున్నారు. సిద్దాపూర్ లో పంచాయతీ పరిధిలో 720 కుటుంబా లున్నాయి. గ్రామ జనాభా 3400 కాగా.. పంచాయతీ పరిధిలో ఏన్గులమడుగుతండా, చింతగట్టుతండా, పులిచర్లకుంట తండాలున్నాయి.ఈ తండాల్లో సీసీ రోడ్లు లేవు. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఒకేచోట ఉన్నా శిథిలావస్థకు చేరాయి. 280 మంది విద్యార్థులకు సరిపోను గదులు లేవు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం సరిగ్గాలేవు. అండర్ గ్రౌండ్ డ్రయినేజ్ లేదు, గ్రామంలో కమ్యూనిటీ హాల్, మహిళా సంఘం, పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. ముఖ్యంగా సిద్దాపూర్ గ్రామంలో పశుపోషణ ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి పాలను హైదరాబాద్, షాద్ నగర్ తీసుకువెళు తుంటారు. అందుకే పశువైద్యశాల ఉంటే బాగుంటుందని గ్రామస్థులు అంటున్నారు.