రామ్‌, రాశీఖన్నా ఇంకోస్సారి

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ఈ సంవత్సరం హిట్‌ కొట్టి మంచి బోణీ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ సొంతం చేసుకున్నాడు ఈ ఏడాది ‘నేను, శైలజ..’ సినిమాతో యంగ్‌ హీరో రామ్‌. ఆ సినిమా తరువాత రామ్‌ తన తదుపరి సినిమా జాడ లేదు ఇంకా. అయితే తాజాగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతోందట. ఈ సినిమాలో ముద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించనుందట. గతంలో రామ్‌, రాశి ఖన్నా కాంబినేషన్‌లో వచ్చిన ‘శివం’ అంచనాల్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఆ సినిమా టైమ్‌లో రాశి ఖన్నా, రామ్‌లకు స్నేహం బాగా వర్కవుటయ్యిందట. ఈ స్నేహమే, తన తాజా చిత్రంలో రామ్‌, రాశి ఖన్నాని ఎంచుకోవడానికి కారణమని సమాచారమ్‌.

రాశి ఖన్నా అంతే, ఏ సినిమా చేసినా ఆ సినిమా హీరోకి బాగా దగ్గరైపోతుంటుంది. ‘సుప్రీం’ సినిమా తర్వాత సాయిధరమ్‌ తేజ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో రాశి ఖన్నా చేరిపోయింది. రవితేజకీ అంతే. ఈ బబ్లీ బ్యూటీ, గోపీచంద్‌కి కూడా బెస్ట్‌ ఫ్రెండ్‌. అందచందాలే కాకుండా, చాలా టాలెంట్‌ కూడా ఈ బ్యూటీ సొంతం. అందుకే రాశి ఖన్నాని ఎవరైనా ఇష్టపడ్తారు. రామ్‌, రాశి ఖన్నాని ఏరికోరి ఎంచుకోవడానికి ఇంకో కారణం, ‘శివమ్‌’లో తమ మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అవడమేనట. గతంలో రామ్‌, దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కందిరీగ’ మంచి విజయం సాధించింది. దాన్ని మించి, విజయవంతమయ్యేలా మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని రామ్‌, సంతోష్‌ శ్రీనివాస్‌ ప్లాన్‌ చేశారని సమాచారమ్‌.